కాలం కలిసొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అదనపు నిధులు వచ్చి పడుతున్నాయి. బిమల్ జలాన్ కమిటీ సిఫార్సులపై రిజర్వ్‌బ్యాంక్ కేంద్ర మండలి ఆమోదముద్ర వేయడం తరువాయి, ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగనంత మొత్తంలో కేంద్ర కోశాగారంలోకి మిగులు నిధుల ప్రవాహానికి దారులు తెరుచుకున్నాయి!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఆవరిస్తూ దేశీయంగానూ వృద్ధిరేటు అంచనాలు తెగ్గోసుకుపోతున్న తరుణమిది. ఈ సంవత్సరం జనవరి-మార్చి మధ్య 5.8శాతానికి పరిమితమైన వృద్ధిరేటు తరవాతి త్రైమాసికంలో 5.7శాతానికి కుంగింది. మూడీస్ సంస్థ జోస్యం పలికిన 6.7శాతం కన్నా తక్కువకు వృద్ధిరేటు తల వేలాడేస్తుండగా- జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను) పద్దుకింద రాబడి, ఆదాయ పన్ను వసూళ్లు నిర్దేశిత లక్ష్యాలకు దూరంగా ఆగిపోవడం వ్యూహకర్తల్ని కలవరపరుస్తోంది. బడ్జెట్లో భారీయెత్తున ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికల నిమిత్తం నిధులకు కొరత వెన్నాడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి స్థూల దేశీయోత్పత్తిలో 3.3శాతానికి ద్రవ్యలోటు కట్టడి కావాలన్నది ప్రభుత్వ ప్రవచిత లక్ష్యం. ఏడాది మొత్తానికి సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలుగా లెక్కతేలాల్సిన ద్రవ్యలోటు రాశి ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికం చివరికే రూ.4.32 లక్షల కోట్లకు ఎగబాకింది. కమ్ముకొస్తున్న ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కడమెలాగని తలపట్టుకున్న కేంద్రానికి జలాన్ కమిటీ సిఫార్సులు వీనుల విందయ్యాయి.
మాంద్యాన్ని ఎదుర్కొనేందుకే వాడండి..
ఆర్‌బీఐ మండలి సమ్మతించిన ప్రకారం 2018-19 సంవత్సరానికి రూ.1,23,414 కోట్ల మిగులు మొత్తంతోపాటు సవరించిన ద్రవ్య పెట్టుబడి చట్రం (ఈసీఎఫ్) ప్రాతిపదికన రూ.52,637 కోట్ల అధిక నిల్వలు కేంద్ర ఖజానాకు జమపడనున్నాయి. మొన్న ఫిబ్రవరిలో చెల్లించిన రూ.28 వేలకోట్ల మధ్యంతర డివిడెండు పోను తక్కిన మొత్తం లెక్కించినా- ఆర్‌బీఐ నుంచి డివిడెండుగా బడ్జెట్లో ప్రస్తావించిన రూ.90 వేలకోట్లకన్నా అధికంగా నిధుల ప్రవాహం కేంద్రానికి సాంత్వన ప్రసాదించనుంది. ఈ నిధుల్ని ఎలా వినియోగించాలన్నదానిపై ఇదమిత్థంగా ఇంకా నిర్ధారణకు రాలేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నా- అవి మాంద్యానికి మేలిమి ఔషధంగా ఉపకరించాలన్నదే పలువురు నిపుణుల ఉమ్మడి సలహా!
ఆర్బీఐ స్థిరత్వం కోల్పోతుందా?
అదనపు నిధుల అంశమే ఏడాది క్రితం రిజర్వ్ బ్యాంకుకు, మోదీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణాత్మక వాతావరణానికి కేంద్ర బిందువైంది. అధిక డివిడెండ్ కావాలని కేంద్రం ఆర్‌బీఐపై ఒత్తిడి పెంచడం అనుచితమేనని విమర్శించినందుకు రిజర్వ్‌బ్యాంక్ బోర్డులో డైరెక్టరుగా ఉన్న నచికేత్ మోర్‌పై నిరుడు అక్టోబరులో ఉన్నట్టుండి వేటుపడింది. కేంద్రీయ బ్యాంకు స్వయంప్రతిపత్తిపై డిప్యూటీ డైరెక్టర్ విరాల్ ఆచార్య సూటి వ్యాఖ్యలతో సర్కారు అగ్గిమీద గుగ్గిలమైంది. అప్పటికి ఆర్‌బీఐ వద్ద పోగుపడిన రూ.9.63 లక్షల కోట్ల నిధుల్లో తనకు రూ.3.6 లక్షల కోట్ల మేర బదిలీ చేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని రిజర్వ్‌బ్యాంక్ సారథిగా ఉర్జిత్ పటేల్ తోసిపుచ్చారన్న కథనాలు వెలుగుచూశాయి. ఆర్‌బీఐ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వ విధానానికి కట్టుబాటు చాటిన పటేల్ గత డిసెంబరులో రాజీనామా చేసి నిష్క్రమించడం తెలిసిందే. సహాయ నిరాకరణ దశకు చేరిన రిజర్వ్‌బ్యాంక్ సారథ్య పగ్గాలు శక్తికాంత దాస్‌కు దఖలుపడిన దరిమిలా ఆర్‌బీఐ మిగులు నిధుల విషయమేమిటో తేల్చడానికి బిమల్ జలాన్ కమిటీ నియుక్తమైంది. మూడు నెలల గడువును పొడిగించి, ఆర్థిక కార్యదర్శిగా సుభాష్‌చంద్ర గార్గ్ స్థానే రాజీవ్ కుమార్‌ను నియమించాకనే వాతావరణం కొంత తేటపడింది. కనుకనే కీలక వడ్డీరేట్ల కోతలను వెన్నంటి మిగులు నగదు నిల్వల బదిలీపైనా రిజర్వ్‌బ్యాంక్ బాణీ కేంద్రం నాగస్వరానికి అనుగుణంగా మారింది. ఆర్‌బీఐ ఆస్తిఅప్పుల పట్టీ (బ్యాలన్స్ షీట్) ప్రాతిపదికన 6.5-5.5 శాతం మేర అత్యవసర నిధిని ప్రత్యేకించాలని బిమల్ జలాన్ కమిటీ సిఫార్సు చేయగా, కనిష్ఠ పరిధికి ఓటేయడం ద్వారా కేంద్రానికి అందుబాటులోకి వచ్చే నిధులు పెరిగాయి. మున్ముందూ ఇదే ఒరవడి స్థిరపడితే రిజర్వ్‌బ్యాంక్ ఆర్థిక సుస్థిరత మాటేమిటి?
అప్పుడలా.. ఇప్పుడిలా
ద్రవ్యలోటును ఎదుర్కోవడంలో మునుపటి ప్రభుత్వాలకన్నా మెరుగైన రికార్డు కలిగిన తమ సర్కారుకు రిజర్వ్‌బ్యాంక్ మిగులు నిధులు అక్కర్లేదని ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ గత డిసెంబరులో లోక్‌సభాముఖంగా స్పష్టీకరించారు. ఆర్‌బీఐ చెంత ఉన్న మిగులు నిల్వల్ని పేదరిక నిర్మూలనకు, ప్రభుత్వరంగ బ్యాంకుల అదనపు పెట్టుబడి అవసరాలకు ఉపయోగించవచ్చునని నాడాయన సూచించారు. ఇప్పటి వాస్తవ పరిస్థితి వేరు. ఆర్థిక మంత్రిత్వశాఖను పర్యవేక్షిస్తున్న నిర్మల ఇటీవల ప్రకటించిన ప్రకారం బ్యాంకులకు రూ.70 వేలకోట్ల మూలధన ప్రదానంపై ఇచ్చిన మాట దక్కించుకోవడానికి ఆర్‌బీఐ మిగులు నిధులే అక్కరకు రానున్నాయన్నది విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో రిజర్వ్‌బ్యాంక్ వద్ద మిగులు నిల్వలు ఉంటున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, అందులో సగం 14 శాతం దాకా నిధులు సరిపోతాయన్న వాదనకు లోగడే ఓటేసిన ఆర్థిక మంత్రిత్వశాఖ మిగులును ఎలా సద్వినియోగపరచాలన్నదానిపై ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేకపోయిందని- అమాత్యుల స్పందనే వెల్లడిస్తోంది. పొదుపు నిధుల్ని దీర్ఘకాలిక పెట్టుబడులుగా మళ్ళించాలే తప్ప లోటుభర్తీకి వినియోగించరాదన్న సూచనలు ఎన్నాళ్లుగానో వినిపిస్తున్నాయి. పన్ను వసూళ్లలో లోటుభర్తీకి ఆర్‌బీఐ నిధుల్ని ఉపయోగిస్తే, ద్రవ్యోల్బణ సమస్య పెచ్చరిల్లుతుందన్న హెచ్చరికలూ తేలిగ్గా తోసిపుచ్చలేనివి. తయారీ రంగం బహుముఖ సవాళ్ల పాలబడిన దృష్ట్యా పారిశ్రామికాభివృద్ధి సూచీ కోలుకోవడానికి సుదీర్ఘకాలం పడుతుందన్న వ్యాఖ్యల వెలుగులో కేంద్రం అప్రమత్తం కావాలి. నెమ్మదించిన ఆర్థిక రంగాన్ని తిరిగి ఉరకలెత్తించే సరైన ఉద్దీపన చర్యలకు మిగులు నిధుల్ని మళ్ళించడమే విజ్ఞతాయుత నిర్ణయంగా మన్ననలందుకుంటుంది!
ఇదీ చూడండి: 'ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నిర్ణయాలు భేష్'