వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) ప్రైవేటీకరణ ప్రక్రియకు ప్రభుత్వం భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), ఎయిరిండియాలతో శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. జూన్-జులైలో వీటి ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామనే నమ్మకంతో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) ఉన్నట్లు తెలుస్తోంది. "పెట్టుబడుల ఉపసంహరణ నిమిత్తం జాబితాలో చేర్చిన సంస్థలన్నింటిలో ఎయిరిండియా, బీపీసీఎల్‌లో వాటా విక్రయ ప్రక్రియే తుది దశల్లో ఉంది. అందుకే ముందుగా వీటి ప్రైవేటీకరణను పూర్తి చేస్తాం. ఏప్రిల్-జూన్ త్రైమాసికం చివరికల్లా లేదంటే రెండో త్రైమాసికం ప్రారంభంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ"ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
అవరోధాలు తొలగినట్లేనా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లోనే బీపీసీఎల్, ఎయిరిండియాతో పాటు కాంకర్, షిప్పింగ్ కార్పొరేషన్ సంస్థల వాటా విక్రయాలు ఉన్నాయి. ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ ఏడాది కొవిడ్-19 పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకెళ్లలేకపోయింది. దీంతో కొన్నాళ్లుగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ రెండు దిగ్గజ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను ఈసారి ఎలాగైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు కూడా కొన్ని అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ సిద్ధమవుతోంది. మార్చి మధ్య నుంచి నవంబరు మధ్య వరకు దశలవారీగా ఈ నిరసనల కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నిరసనల అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని.. ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చూసేందుకు ప్రభుత్వం తమకు పూర్తి మద్దతు ఇచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు.
ప్రైవేటీకరణపైనే ఆధారం..
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం విదితమే. గతంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధించేందుకు ఎక్కువగా పబ్లిక్ ఇష్యూలు, ఆఫర్ ఫర్ సేల్, విలీనాలు, షేర్ల బైబ్యాక్ లాంటి వాటిపై ప్రభుత్వం ఆధారపడేది. ఈసారి లక్ష్య సాధనకు ప్రైవేటీకరణ, ఆస్తుల విక్రయంపై అధికంగా ఆధారపడింది. రూ.1.75 లక్షల కోట్లలో రూ.75,000 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విక్రయం, ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా మిగతా రూ.లక్ష కోట్లు రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. బీపీసీఎల్, ఎయిరిండియాలో వాటా కొనుగోలుకు పలు సంస్థలు ఆసక్తి కనబర్చడంతో ఈ ప్రక్రియను మరింత ఉత్సాహంతో వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు వేదంతా రిసోర్సెస్, అపోలో గ్లోబల్, ఐస్క్వేర్డ్ కేపిటల్‌లు, ఎయిరిండియా కోసం స్పైస్‌జెట్, టాటాలు, పవన్ రుయా సంస్థలు ఆసక్తి కనబర్చాయి. పవన్‌హన్స్, ఎన్‌ఐఎన్‌ఎల్‌తో పాటు పేరు వెల్లడించని రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, రెండు సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణ ప్రక్రియ కూడా 2021-22లో చేపట్టాల్సిన ప్రైవేటీకరణ ప్రక్రియ జాబితాలో ఉన్నాయి.
- ఇదీ చూడండి: 'వ్యూహాత్మక తయారీతోనే సత్వర ఆర్థికాభివృద్ధి'