అయిదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ(సీసీఈఏ).. ఆమోదం తెలిపింది. ప్రైవేటీకరణను తిరిగి ప్రారంభించేందుకు, పన్ను రహిత రెవెన్యూ కార్యకలపాలను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తో పాటు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్), తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్), ఈశాన్య భారత విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్ఈఈపీసీఓ)లో ప్రభుత్వ వాటాలు విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఈ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా యాజమాన్య మార్పిడి ఉంటుంది. అయితే ఈ అయిదు సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఆమోదించలేదు. టీహెచ్‌డీసీఐఎల్, ఎన్ఈఈపీసీఓ రెండు సంస్థలను మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ తీసుకోనుంది. ఈ రెండూ ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండనున్నాయి.
బిడ్డింగ్ ఫలితం ప్రకారం.. మిగిలిన మూడు సంస్థల యాజమాన్య హక్కులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది.
కీలక నిర్ణయాలు...
బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 53.3 శాతంతో పాటు, యాజమాన్య హక్కులను కొనుగోలుదారుకు వదిలిపెట్టాలని నిర్ణయించింది కేంద్రం. అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్)లో బీపీసీఎల్‌కు 61.65 శాతం ఈక్విటీ వాటా ఉంది. ఈ రిఫైనరీని మినహాయించి మిగిలిన బీపీసీఎల్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకోనుంది.
అదే తరహాలో...
షిప్పింగ్ కార్పొరేషన్‌లో ప్రభుత్వ వాటా 63.75 శాతంతోపాటు యాజమాన్య హక్కులను పూర్తిగా బదలాయించాలని నిర్ణయించింది కేంద్రం. కాంకర్‌లో 54.8 శాతంగా ఉన్న తన వాటాలో ప్రభుత్వం 30.8శాతంతో పాటు యాజమాన్య హక్కులను బదలాయించాలని తీర్మానించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.17,364 కోట్ల మేర పెట్టుబడుల ఉపసంహరణకు ప్రక్రియ మొదలుపెట్టింది.
బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండూ లిస్టెడ్ సంస్థలు. టీహెచ్‌డీసీఐఎల్, ఎన్ఈఈపీసీఓ లిస్టెడ్ కంపెనీలు కాదు. అయినప్పటికీ ఈ ఏడాది రూ.1,05,000 కోట్ల వాటాలు ఎన్టీపీసీకి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్య హక్కులు, నిర్వహణ బాధ్యతను తీసుకోవడానికి... బిడ్డింగ్‌కు ప్రైవేట్ రంగ సంస్థలు ఎంత మేర ఆసక్తి కనబరుస్తాయో చూడాలి.
రుణాలతోనేనా..?
కార్పొరేట్ సంస్థల వద్ద ఉన్న డబ్బు, ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని చూస్తే... బిడ్డర్లు వారి వనరులు, లాభాల నుంచే ఇంత డబ్బును సమీకరిస్తారా లేక బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) నుంచి అప్పు తీసుకుంటారో చూడాలి.
ఒకవేళ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ వాటాల కొనుగోలుకు అంత సుముఖత చూపకపోతే.. మొండిగా ముందుకు వెళ్లి మరిన్ని సీపీఎస్ఈలను ప్రైవేటీకరణ చేసే కన్నా వేరే మార్గాన్ని ప్రభుత్వం వెతికే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.
అయితే ప్రభుత్వ సంస్థల నుంచి 51 శాతానికి కన్నా తక్కువగా ప్రభుత్వ వాటా తగ్గినా.. ఆయా సంస్థలు ప్రభుత్వాధీనంలోనే ఉండేలా సీసీఈఏ ఆమోదం తెలిపింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, దేశీయ రిటైల్ పెట్టుబడుదారుల నుంచి పెట్టబడుల ఆకర్షణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.
బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వం ప్రయోగం చేయనుంది. అసలు ప్రైవేటీకరణపై ప్రైవేట్ రంగం ఎంత ఆసక్తి కనబరుస్తుందనే విషయం తెలుసుకోనుంది. అలానే ప్రత్యామ్నాయ ప్రణాళికలను రచించింది. యాజమాన్య హక్కులను వదులుకున్నప్పటికీ... ప్రభుత్వాధీనంలోనే ఉండేలా స్టాక్ మార్కెట్లలో తన షేర్లను అమ్మేందుకు చూస్తోంది.
(రచయిత - పూజా మెహ్రా, సీనియర్ జర్నలిస్ట్)