ఇండిగో వృద్ధి ప్యూహాల అమలుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి యాజమాన్యానికి పూర్తి మద్దతు ఉన్నట్లు ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ సీఈఓ రొనోజాయ్ దత్ వెల్లడించారు.
ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం నెలకొన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సంస్థ ఉద్యోగులకు ఈ మేరకు ఆయన ఈ-మెయిల్ ద్వారా భరోసా ఇచ్చారు.
"ఎయిర్‌లైన్స్ వృద్ధి వ్యూహాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని నేను మీకు భరోసా ఇవ్వాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ల బోర్డు నుంచి యాజమాన్యానికి పూర్తి మద్దతు ఉంది. మన సంస్థ ప్రమోటర్ల మధ్య వివాదం తలెత్తినట్లు వస్తున్న వార్తలపై మీరంతా అప్రమత్తంగా ఉన్నారని నేను భావిస్తున్నాను."
- రొనోజాయ్ దత్, ఇంటర్‌గ్లోబ్ సీఈఓ
వివాదం ఏంటంటే...
మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం... ఇండిగోలో వ్యూహాలు, నిర్ణయాల విషయంలో సంస్థ ప్రధాన ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ మధ్య అధిపత్య వివాదం తలెత్తింది.
ఈ అనిశ్చితుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి జే సాగర్ అసోసియేట్స్, ఖైతాన్ అండ్ కోను న్యాయ సలహా కోరినట్లు తెలిసింది. వివాదం వార్తలపై స్పందించేందుకు ఇండిగో నిరాకరించింది.
ఇండిగోలో రాహుల్ భాటియాకు 38 శాతం వాటా ఉండగా.. రాకేశ్ గంగ్వాల్‌కు 37 శాతం వాటా ఉంది.