ఓలా.. భారత్ మొబిలిటీ సేవల్లో ఓ సంచలనం. ఇప్పుడు మరో రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని ఏళ్లలో శిలాజ ఇంధనాల శకం ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్తంతా స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలదే కానుంది. ఈ మార్పుని 'ఓలా ఎలక్ట్రిక్' ఓ అవకాశంగా మలచుకునేందుకు సిద్ధమైంది. భారత్ కేంద్రంగా ప్రపంచ విద్యుత్తు వాహన విపణిపై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా ఇప్పటికే బెంగళూరుకు కొద్ది దూరంలోని తమిళనాడు రాష్ట్రపరిధిలోని ప్రాంతంలో 'ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ'కి పునాది రాయి వేసింది. కంపెనీ కార్యనిర్వణాధికారి(సీఈఓ) భవిష్ అగర్వాల్ వారాంతంలో ఇక్కడే గడుపుతూ 'మరో చరిత్ర'కు మార్గనిర్దేశం చేస్తున్నారు.
భారీ పెట్టుబడి..
బెంగళూరు నుంచి చెన్నై వైపు 150 కి.మీ దూరంలో తమిళనాడులోని కృష్ణగిరి అనే ప్రాంతంలో భారీ స్థాయిలో బుల్డోజర్లు, యంత్రాలు పనిచేస్తున్నాయి. దాదాపు 500 ఎకరాల్లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ కేంద్రానికి చిరునామా కానుంది. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి తయారీ ప్రారంభించాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి నిర్మాణం 2022, జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ భారీ ప్రాజెక్టు మొత్తంపై రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇక మొదటి దశ పూర్తయ్యే సరికి రూ.2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఏడాదికి కోటి యూనిట్లు..
విద్యుత్తు వాహన విపణి ఇప్పుడిప్పుడే రెక్కలు తొడుగుతోంది. మరి దీన్ని చేజిక్కించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం భారీ స్థాయిలో విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేయడం. అందుకే జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసే దిశగా సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇక్కడ ఏడాదికి 20 లక్షల స్కూటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే సంవత్సరానికి కోటి యూనిట్లు ఉత్పత్తి కానున్నాయి. అంటే దాదాపు రెండు సెకన్లకు ఒక యూనిట్‌ను తయారు చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం 10 పూర్తిస్థాయి ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. 3,000 రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఈ ఫ్యాక్టరీలో 10 వేల మంది ఉపాధి కల్పించనున్నారు.
-
Sharing our vision of the Ola Futurefactory! With 10M units/yr, it'll be the largest 2W factory in the world, 15% of world’s capacity! With 3000+ robots, it'll be the most advanced & with 100 acres of forest, carbon negative operations, it‘ll be the most sustainable. @OlaElectric pic.twitter.com/1iSjFCMJIS
— Bhavish Aggarwal (@bhash) March 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sharing our vision of the Ola Futurefactory! With 10M units/yr, it'll be the largest 2W factory in the world, 15% of world’s capacity! With 3000+ robots, it'll be the most advanced & with 100 acres of forest, carbon negative operations, it‘ll be the most sustainable. @OlaElectric pic.twitter.com/1iSjFCMJIS
— Bhavish Aggarwal (@bhash) March 8, 2021Sharing our vision of the Ola Futurefactory! With 10M units/yr, it'll be the largest 2W factory in the world, 15% of world’s capacity! With 3000+ robots, it'll be the most advanced & with 100 acres of forest, carbon negative operations, it‘ll be the most sustainable. @OlaElectric pic.twitter.com/1iSjFCMJIS
— Bhavish Aggarwal (@bhash) March 8, 2021
అన్నీ ఇక్కడే..
భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. వాహనాలతో పాటు బ్యాటరీలు, మోటార్లు, వాహనాల సాఫ్ట్‌వేర్ తయారీ కేంద్రాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటినీ ఓలా స్వయంగా డిజైన్ చేసి తమ వాహనాల్లో వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీ స్థాయిలో పరిశోధన కార్యక్రమాలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 100 పేటెంట్లను కూడా సంపాదించింది. వీటిలో కొన్ని భవిష్ అగర్వాల్ పేరిట ఉన్నాయి. ఇక కంపెనీ ఇంధన అవసరాల్లో 20 శాతం సౌరవిద్యుత్తుని వినియోగించుకోనున్నారు. భవిష్యత్తుల్లో ఇక్కడి నుంచే కార్లు కూడా తయారు చేయాలని నిర్ణయించారు.
టెస్లాకు స్వాగతం..
ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే ప్రస్తుతానికి గుర్తొచ్చే ఏకైక కంపెనీ టెస్లా. ఇది భారత్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది భారత్‌లో టెస్లా కారు అందుబాటులోకి రానుందని ఎలన్ మస్క్ ఆ మధ్య ట్వీట్ చేశారు. ఇక బెంగళూరులో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారు. అలాగే మరికొన్ని నగరాల్లో ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కంపెనీ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెస్లాకు రాయితీలిచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌కు టెస్లా నుంచి తీవ్రపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, భవిష్ అగర్వాల్ మాత్రం ఈ విషయంలో చాలా ధీమాగా ఉన్నారు. ఖరీదైన, విలాసవంతమైన ఉత్పత్తులపైనే టెస్లా దృష్టిసారించనుందని తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ ఉత్పత్తులు మాత్రం పూర్తిగా పట్టణ ప్రాంత వాహనదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. టెస్లాను ఆయన భారత్‌కు ఆహ్వానించారు. భారత్‌లో విద్యుత్తు వాహన విపణి విస్తరణకు టెస్లా అవసరమని అభిప్రాయపడ్డారు.