పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ జులై 25న మరోసారి విచారణకు హాజరుకానున్నారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ న్యాయస్థానం ఎదుట నేడు వీడియోలింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు నీరవ్. ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మళ్లీ విచారణ జరిగేవరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు.
కేసు దస్త్రాలు పరిశీలించేందుకు.. అనుమతించాలన్న నీరవ్ విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. అయితే.. దాదాపు 5000 పేజీల మేర ఉన్న కేసు సంబంధిత దస్త్రాలను చూసేందుకు ల్యాప్‌టాప్‌నూ అనుమతించాలని కోరారు నీరవ్ న్యాయవాదులు. దీనిపై కోర్టు స్పందించలేదు.
రుణ ఎగవేత, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ను స్వదేశానికి రప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది భారత్.
నీరవ్ మోదీని అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్ కోర్టు ఆయనపై ఆరెస్టు వారెంటు జారీ చేసింది. మార్చి 19న స్కాట్లాండ్ యార్డ్ అధికారులు నీరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు నీరవ్ 4 సార్లు బెయిల్‌కు యత్నించగా.. ప్రతిసారీ కోర్టులో చుక్కెదురైంది.