దేశంలో అగ్రగామి స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా), తొలిసారి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు సిద్ధం అవుతోంది. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్‌తో స్టాక్ ట్రేడింగ్ కార్యకలాపాలను తిరగరాసిన ఈ కొత్త తరం స్టాక్ ఎక్స్ఛేంజీ గత కొంతకాలంగా ఐపీఓ సన్నాహాల్లో ఉంది. కానీ అనుకోని అవాంతరాల వల్ల అది ఇంతవరకూ సాధ్యపడలేదు. పబ్లిక్ ఇష్యూ గత ఏడాదిలోనే పూర్తికావాల్సింది. కానీ కొన్ని బ్రోకింగ్ సంస్థలకు ఎన్‌ఎస్‌ఈ అందజేసిన కో-లొకేషన్ సర్వీస్ వివాదాస్పదం కావడం, దానిపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా) ఎన్‌ఎస్‌ఈని ఇన్వెస్టర్ ఫండ్‌కు రూ.1,200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించడం వల్ల పబ్లిక్ ఇష్యూ వ్యవహారం పెండింగ్‌లో పడిపోయింది. దీని వల్ల అప్పటికే సెబీ వద్ద దాఖలు చేసిన ఐపీఓ దరఖాస్తును ఎన్‌ఎస్‌ఈ వెనక్కి తీసుకుంది. మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో ఐపీఓ దరఖాస్తు దాఖలు చేసింది. దీనికి త్వరలో అనుమతి రాబోతోందని స్టాక్ మార్కెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రెండేళ్ల కిందటే బీఎస్‌ఈ..
స్టాక్ ఎక్స్ఛేంజీలు పబ్లిక్ ఇష్యూకు వెళ్లి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యేందుకు (లిస్టింగ్) మూడేళ్ల క్రితం సెబీ వీలు కల్పించింది. దీంతో ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలుగా ఉన్న బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ), ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు వెళ్లేందుకు అవకాశం వచ్చింది. దీన్ని ముందుగా బీఎస్‌ఈ అందిపుచ్చుకుంది. అయితే ఈ ఎక్స్ఛేంజీలు లిస్టింగ్ మాత్రం వేరే ఎక్స్ఛేంజీలోనే చేయాలి. అంటే బీఎస్‌ఈ లిస్టింగ్ ఎన్‌ఎస్‌ఈలో జరుగుతుంది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్ బీఎస్‌ఈలో చేయాలి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ రెండేళ్ల క్రితమే పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఐపీఓ లో రూ.1,243 కోట్లు మదుపరుల నుంచి సమీకరించింది. ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో నమోదయ్యాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ షేరు, ఎన్‌ఎస్‌ఈలో రూ.530 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం బీఎస్‌ఈ మార్కెట్ విలువ (మార్కెట్ కేపిటలైజేషన్) దాదాపు రూ.2,405 కోట్లు ఉన్నట్లు అవుతోంది. ఒక దశలో బీఎస్‌ఈ షేరు రూ.1,100 పలికింది. దాని ప్రకారం దాదాపు రూ.5,000 కోట్ల మార్కెట్ విలువకు చేరింది. కానీ ఆ తర్వాత షేరు ధర దిగిరావటం వల్ల బీఎస్‌ఈ మార్కెట్ విలువ తగ్గిపోయింది.
ఎన్‌ఎస్‌ఈ షేర్లకు మంచి విలువ!
బీఎస్‌ఈతో పోల్చితే, ఎన్‌ఎస్‌ఈ లిమిటెడ్‌లో లావాదేవీలు ఎంతో అధికం. అటు నగదు విభాగంలో, ఇటు ఎఫ్ అండ్ ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలో ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్ కార్యకలాపాలు పెద్దఎత్తున నమోదవుతాయి. ముఖ్యంగా సంస్థాగత మదుపరులు భారీ లావాదేవీలను ఈ ఎక్స్ఛేంజీ ద్వారా నిర్వహించడం కనిపిస్తుంది. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ వార్షిక ఆదాయాలు, లాభాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.3,507 కోట్ల ఆదాయాన్ని, రూ.1,884 కోట్ల నికరలాభాన్ని ఈ సంస్థ ఆర్జించింది. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ, ఐపీఓకు వచ్చి తన షేర్లను స్టాక్ మార్కెట్లో నమోదు చేస్తే, దానికి ఎంతో అధిక మార్కెట్ విలువ లభిస్తుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ కోసం ఎన్నో సంస్థలు, రిటైల్ మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ ఎక్స్ఛేంజీలో వాటాలు కలిగి ఉన్న బ్యాంకులు, ఇతర సంస్థలు కొంతమేరకు ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో తమ వాటాలు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు గత ఏడాది కాలంగా ఆఫ్-మార్కెట్ పద్ధతితో ఎన్‌ఎస్‌ఈ షేర్లను ప్రస్తుత వాటాదార్ల నుంచి కొనుగోలు చేసిన మదుపరులు కనిపిస్తున్నారు. ఇటువంటి వారంతా ఎన్‌ఎస్‌ఈ షేర్ల లిస్టింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తత్ఫలితంగా తమ వద్ద ఉన్న షేర్లకు మంచి విలువ లభిస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జొమాటో ఐపీఓ