కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు 7 నెలలపాటు మూతపడిన మల్టీప్లెక్స్‌లు.. ఇటీవలే మళ్లీ తెరుచుకున్నాయి. అయితే కరోనా నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్‌ల నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. నిర్వహణ వ్యయాలు గతంతో పోలిస్తే ఇప్పుడు 25 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నాయి.
కరోనాతో నెలకొన్న పరిస్థితులతో.. సినీ ప్రియులను తిరిగి హాళ్లకు రప్పించేందుకు వ్యాపార భాగస్వాములతో కలిసి ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి మల్టీప్లెక్స్‌లు. ప్రస్తుతం థియేటర్లలో కొత్త కంటెంట్ లభించడం సవాలుతో కూడుకున్న పని.. అందువల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పాత సినిమాలనే మళ్లీ వేయడం సహా పలు ఇతర ప్రణాళికలు రచిస్తున్నాయి.
'కొత్తగా వచ్చిన ప్రామాణిక నిర్వహణ విధానాలతో.. వినోద రంగంలో 25 శాతం నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని మేము అంచనా వేస్తున్నాము.' అని ముక్తా ఏ2 సినిమాస్ వ్యాపార అధిపతి సచిదానంద్ శెట్టి తెలిపారు. అయితే ప్రేక్షకుల ఆరోగ్య సంరక్షణకు ఇది తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ ఖర్చులను ఆపలేము..
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నిబంధనల అమలుకు ఖర్చులు పెరగటాన్ని ఆపలేమని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలి అన్నారు. కంపెనీ ఫ్రాంచైంజీలన్నింటి కోసం శానిటైజేషన్ మిషిన్లు, ఇతర పరికరాలకోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు.
'భారీగా పెరిగిన నిర్వహణ ఖర్చులను భర్తీ చేసుకునేందుకు.. మరెక్కడైన కోతలు విధించక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్యుపెన్సీ తక్కువగానే ఉంటుందని తెలుసు. కాబట్టి తక్కువ మొత్తంలో సిబ్బందితోనే ప్రస్తుతం వ్యాపారాలు నిర్వహించనున్నట్లు' పేర్కొన్నారు సంజీవ్ కుమార్.
మరో సంస్థ సినీ పోలిస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల అమలుకు ఖర్చులు కచ్చితంగా పెరుగుతాయి. అయినప్పటికీ తమ ప్రేక్షకుల ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని ఇవ్వడంలో భాగాంగా.. అందుకు తగ్గ నిబంధనలు పాటించడం అవసరమని భావిస్తున్నట్లు సినీపోలిస్ ఇండియా సీఈఓ దేవాంగ్ సంపత్ అన్నారు.
అయితే పెరిగిన వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు.. తాము పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అన్ని విభాగాలపై ఖర్చు చేసే మొత్తాన్ని తగ్గించినట్లు వివరించారు. ప్రస్తుతం అత్యవసరం కాని ఖర్చులను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు.
ఈ సమయంలోనూ భారీ ఆఫర్లు..
ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్‌లు, ఆహార పదార్థాలు, శీతలపానియాలపై తగ్గింపు ఇస్తున్నాయి మల్టీప్లెక్స్‌లు.
ఇలాంటి ఆఫర్ల కోసం టికెట్ భాగస్వాములుతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని.. కొన్నిసార్లు 100 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నట్లు దేవాంగ్ సంపత్ చెప్పారు.
పీవీఆర్ సంస్థ కూడా.. పాత, రిటర్న్ సినిమాలకు రూ.69కే టికెట్ ఇవ్వాలని యోచిస్తోంది.
సినిమాహాళ్లు తెరిచేందుకు కేంద్రం విధించిన నిబంధలు ఇలా..
సినిమా హాలు మొత్తం సామర్థ్యంలో 50 శాతం కంటే తక్కువ ప్రేక్షకులనే అనుమతించాలి. సీట్ల ఏర్పాటులో భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరి. అందుకు అనుగుణంగా సంబంధిత సీట్లపై ‘‘కూర్చోవద్దు’’ అని స్పష్టంగా తెలియజేయాలి. హ్యాండ్ వాష్, శానిటైజర్‌లను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలి. ప్రవేశం వద్ద శరీర ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మల్ స్క్రీనింగ్’ ఏర్పాట్లు ఉండాలి. థియేటర్ సముదాయంలో వివిధ స్క్రీన్ల ప్రదర్శనా సమయాలు వేర్వేరుగా ఉండాలి. హాలులో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. సిబ్బంది భద్రతకోసం శానిటైజేషన్, గ్లౌజులు, బూట్లు, మాస్కులు, పీపీఈ కిట్‌లను ఏర్పాటు చేయాలి.
ఇదీ చూడండి:పండుగ సీజన్లో కార్లపై అదిరే ఆఫర్లు ఇవే..