ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తూ కేవలం డేటాకు మాత్రమే ఛార్జ్ చేస్తున్న రిలయన్స్ జియో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్స్‌కు ఛార్జ్ చేయాలని నిర్ణయించింది. ఇకపై రిలయెన్స్ జియో నుంచి ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియాకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చెల్లించాలని రిలయెన్స్ జియో పేర్కొంది. అయితే ఆ మొత్తానికి సమానమైన ఉచిత డేటాను వినియోగదారులకు అందించనుంది జియో.
జియో నుంచి జియోకు, ల్యాండ్ లైన్, వాట్సప్, ఫేస్‌టైమ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేసే కాల్స్‌కు ఇది వర్తించదని పేర్కొంది రిలయన్స్. అన్ని నెట్‌వర్క్‌ల నుంచి ఇన్‌కమింగ్ కాల్స్ ఎప్పటిలానే ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
నేటి నుంచి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులందరికీ ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
ట్రాయ్ నిబంధనలతో ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు జియో సుమారు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించేందుకే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై 6 పైసలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది సంస్థ
ఐయూసీ ఛార్జ్..
ప్రస్తుతం ట్రాయ్ నిబంధనల ప్రకారం టెలికం సంస్థలు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ)ని చెల్లించాల్సి వస్తోంది. 2017లో ఈ ఐయూసీని ట్రాయ్ 14 పైసల నుంచి 6 పైసలుకు తగ్గించింది. ఐయూసీ 2020 జనవరి వరకు కొనసాగుతుందని అప్పట్లో పేర్కొంది. అనంతరం అది రద్దవుతుందని వెల్లడించింది. అయితే తాజాగా ఆ గడువును పొడిగించాలా లేదా అనే దానిపై ట్రాయ్ సంప్రదింపులు ప్రారంభించింది.
ఇదీ చూడండి: పసిడి ధరలు మళ్లీ పరుగు- ప్రస్తుత ధర ఎంతంటే...