ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈనెల 15 కల్లా ఆర్థిక బిడ్లు (Air India bidding) రావాల్సి ఉంది. అయితే కెయిర్న్ వివాదం (Cairn Issue) నేపథ్యంలో బిడ్లు సమర్పించేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉన్నందున, వారికి ప్రభుత్వ హామీ (ఇండెమ్నిటీ) ఇవ్వాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కెయిర్న్‌కు అనుకూల తీర్పుతో..
వెనకటి తేదీ నుంచి పన్ను (రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్) కేసులో కెయిర్న్ సంస్థ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో అనుకూల తీర్పు పొందింది. భారత ప్రభుత్వం నుంచి నిధులు వసూలు చేసేందుకు, విదేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్‌లు దాఖలు చేసింది. ఎయిర్ ఇండియా ఆస్తుల్ని జప్తు చేయాలని కోరింది. ఈ వివాద ప్రభావం ఎయిర్ ఇండియా బిడ్లపై పడకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టాటా గ్రూప్, స్పైస్‌జెట్ వంటి దేశీయ సంస్థలు ప్రభుత్వం ఇస్తున్న హామీని స్వాగతిస్తున్నాయని, బిడ్లు దాఖలు చేసేందుకు ఈ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: కెయిర్న్ వివాదంలో అమెరికా కోర్టుకు భారత్