దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా మేలో ఉద్యోగ నియామకాలు 61 శాతం తగ్గాయి. ఉద్యోగ నియామకాలు 60 శాతానికిపైగా పడిపోడవం ఇది వరుసగా రెండో నెల. ఏప్రిల్‌లోనూ నియామకాలు 62 శాతం తగ్గాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్‌కామ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
నౌకరీ డాట్‌కామ్ వెబ్‌సైట్‌లో నమోదైన ఉద్యోగాల సంఖ్య ఆధారంగా నియామకాలను లెక్కించి నౌకరీ జాబ్‌స్పీక్ సూచీ గణాంకాలను ప్రతినెలా విడుదల చేస్తుంది. ఈ సూచీ ప్రకారం.. 2019 మేలో 2,346 నియామకాలు జరగ్గా, 2020 మేలో 910కి పరిమితమయ్యాయి.
'నౌకరీ' నివేదికలోని కీలకాంశాలు..
- ఆతిథ్యం, రెస్టారెంట్లు, పర్యటకం, విమానయాన రంగాల్లో నియామకాలు అత్యధికంగా 91 శాతం క్షీణించాయి.
- రిటైల్ (-87 శాతం), వాహన, విడిభాగాలు (-76 శాతం), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో (-70 శాతం ) క్షీణత నమోదైంది.
- దాదాపు ప్రధాన పట్టణాలన్నింటిలో నియమాకాలు 50 శాతానికిపైగా తగ్గాయి.
- మెట్రో నగరాల్లో కోల్‌కతాలో అత్యధికంగా 68 శాతం, దిల్లీ, ముంబయిలో 67 శాతం క్షీణత నమోదైంది.
- గత నెలలో ఉద్యోగం కోసం వెతికిన ప్రతి 10 మందిలో ఒకరు ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు. 10 మందిలో కనీసం ముగ్గురు ఇప్పుడున్న ఉద్యోగం పోతుందనే భయంతో కొత్త ఉద్యోగం కోసం వెతికారు.
- ఇటీవల ఉద్యోగం కోల్పోయి ఉద్యోగం కోసం వెతికేవారిలో 10 శాతం మందిలో.. విమానయానం, ఈ-కామర్స్ రంగాలకు చెందినవారు 15 శాతం చొప్పున ఉన్నారు. ఆతిథ్య రంగానికి చెందిన వారు 14 శాతం మంది ఉన్నారు.
- ఇటీవల ఉద్యోగం కోల్పోయిన వారిలో 13 శాతం మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు ( 11 ఏళ్లకు పైగా అనుభవం) ఉన్నారు.
ఇదీ చూడండి:దుమ్ములేపిన 'పార్లే-జీ'... 80 ఏళ్ల రికార్డు బ్రేక్