ఎరువుల వాడకంలో సమతుల్యత, పరిశ్రమ సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఫాస్పెటిక్, పొటాషిక్ ఎరువులకు మాత్రమే నిర్ణయిస్తోన్న పోషక ఆధారిత రాయితీ (ఎన్బీఎస్) రేట్లను యూరియాకూ అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
2010 నుంచి..
రసాయన ఎరువులకు స్థిర మొత్తంలో రాయితీ ఇచ్చేందుకు పోషక ఆధారిత రాయితీ (ఎన్బీఎస్) రేట్ల పద్ధతిని 2010లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని వార్షిక ప్రాతిపాదికన నిర్ణయిస్తారు. దీని ద్వారా ఫాస్పెటిక్, పొటాషిక్ (పీ&కే) ఎరువులకు రాయితీలో గ్రేడ్లు అందిస్తున్నారు. ఇందులో యూరియాకు మినహాయింపు ఇచ్చారు.
" పీ&కే ఎరువులకు ఇప్పటికే ఎన్బీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టాం. కానీ అమలులో సమస్యల వల్ల యూరియాకు ఇప్పటి వరకూ ప్రవేశపెట్టలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది. యూరియాకూ ఎన్బీఎస్ పద్ధతి ద్వారా రేట్లను నిర్ణయించే ఆలోచనలు చేపట్టింది ఎరువుల మంత్రిత్వ శాఖ."
-ఎరువుల శాఖ అధికారి
ప్రస్తుతం యూరియా నియంత్రిత ఎరువు. చట్టబద్ధంగా నిర్ణయించిన ధరలో విక్రయిస్తున్నారు. ఒక టన్ను యూరియా ధర గరిష్ఠంగా రూ. 5 వేల 360 రూపాయలుగా ఉంది. భారీగా రాయితీ పొందుతోన్న ఎరువు కావటం వల్ల ఎక్కువగా వినియోగంలో ఉంది.
రేట్లు పెరిగే అవకాశం...
పీ&కే ఎరువుల మాదిరిగా యూరియాను నియంత్రేతర పద్ధతిలోకి తీసుకొస్తే యూరియా రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం పూర్తిగా నియంత్రేతర పద్ధతిలో కాకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరను నిర్ణీత పరిధిలోనే ఉంచే అవకాశం ఉందని తెలిపారు.
240 టన్నుల ఉత్పత్తి
2018-19 ఆర్థిక సంవత్సరం 240 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసింది భారత్. దేశీయ అవసరాన్ని తీర్చేందుకు విదేశాల నుంచి 69 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంది.
ఇదీ చూడండి: యాప్లో ఆర్డరివ్వండి.. తాజా 'కొబ్బరి నీళ్లు' తాగండి