'గూగుల్ స్టేషన్' ఉచిత వైఫై సేవలను నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఐదేళ్లుగా అంతర్జాల సేవలు సులభంగా, అతి తక్కువ ధరలకే లభిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతోంది. భారత్‌తో సహా అన్ని దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను నిలిపివేసే ప్రక్రియను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
ఇందుకోసం స్టేషన్ సేవలు అందిస్తోన్న ప్రాంతాలను క్రమంగా భాగస్వామ్య సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఫలితంగా గూగుల్ ఇందులో నుంచి బయటపడినా సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది.
భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ స్టేషన్ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు సీజర్ సేన్‌గుప్తా తెలిపారు.
"భారత్‌లో ప్రపంచంలో అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ లభిస్తోంది. ఐదేళ్ల కాలంలో చూస్తే 95 శాతం ధరలు తగ్గాయి. సగటున భారత్‌లో ఒక వ్యక్తి నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడు. ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్ను సులభంగా వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. చౌకగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాయి."
-సీజర్ సేన్‌గుప్తా, గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు
గూగుల్ స్టేషన్ పేరుతో రద్దీ ప్రాంతాల్లో వైఫై సేవలను అందిస్తోంది ఈ అమెరికా ఆధారిత సంస్థ. 2015లో భారత రైల్వేలు, రైల్‌టెల్‌తో కలిసి రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించింది గూగుల్. ఇలా ఇప్పటివరకు సుమారు 400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించింది. భారత్ కాకుండా నైజీరియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేసియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్టేషన్ సేవలు అందిస్తోంది గూగుల్.