గూగుల్.... టెక్ దిగ్గజం. సెర్చ్, మ్యాప్స్, యాప్స్... ఇలా ఎన్నో సేవలు అందిస్తుంది. దాదాపు అన్నీ సాంకేతికతకు సంబంధించినవే. పాత్రికేయంతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు గూగుల్‌కు. అయినా ఆ సంస్థ వార్తల ద్వారా 2018లో ఎంత సంపాదించిందో తెలుసా? ఏకంగా 470 కోట్ల డాలర్లు. ఇతర మీడియా సంస్థల వార్తలను సెర్చ్, గూగుల్ న్యూస్ ద్వారా అందించడం ద్వారా గూగుల్ ఇంత భారీ మొత్తంలో ఆర్జించిందని న్యూస్ మీడియా అలయన్స్-ఎన్‌ఎమ్‌ఏ ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.
అమెరికాలోని 2 వేలకుపైగా పత్రికలు... ఎన్ఎమ్ఏలో భాగస్వాములు.
అసలు సంస్థలకు ఎసరు....
అమెరికాలోని మీడియా సంస్థలు 2018లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా ఆర్జించిన మొత్తం 510 కోట్ల డాలర్లు. ఆ మొత్తానికి దాదాపు సమానంగా సంపాదించింది గూగుల్. ఇతర మీడియా సంస్థల వార్తలను సొమ్ము చేసుకోవడంలో గూగుల్ ఎంత మేర ముందుందో ఈ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని నివేదికలో పేర్కొంది ఎన్‌ఎమ్‌ఏ. గూగుల్ ప్రభావంతో గత 2 దశాబ్దాల్లో కొన్ని మీడియా సంస్థలు మూతపడ్డాయని, మరికొన్ని గణనీయంగా ఆదాయం కోల్పోయాయని ఆవేదన వ్యక్తంచేసింది న్యూస్ మీడియా అలయన్స్.
గూగుల్‌కు ఆదాయం ఇలా....
"గూగుల్‌కు వచ్చే సెర్చ్ రిక్వెస్ట్‌లలో దాదాపు 40 శాతం వార్తల కోసమే. నెటిజన్లను గూగుల్ ఇతర మీడియా సంస్థల వెబ్సైట్లకు మళ్లిస్తుంది. ఆ పని ఉచితంగా ఏమీ చేయదు. ఆన్లైన్ యాడ్ రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. వినియోగదారుడు వార్త లింక్‌పై క్లిక్ చేసినప్పుడు అతడి వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్వారా గూగుల్ సంపాదించే మొత్తాన్ని మేము లెక్కించలేదు."
- ఎన్‌ఎమ్‌ఏ నివేదిక
ఆ రెండు సంస్థలే...
న్యూస్ పబ్లిషర్లకు ప్రస్తుతం గూగుల్, ఫేస్బుక్ ప్రధాన డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నాయి. వేర్వేరు వెబ్సైట్లకు వచ్చే ఎక్స్టర్నల్ ట్రాఫిక్‌లో 80శాతం ఈ రెండు సంస్థల నుంచి వస్తున్నదే.