దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ 'గోఎయిర్'ను సిబ్బంది కొరత కష్టాలు వెంటాడుతున్నాయి. విమాన, కాక్‌పిట్ సిబ్బంది కొరతతో 18 విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ముంబయి, గోవా, బెంగళూరు, దిల్లీ, శ్రీనగర్, జమ్ము, పట్నా, ఇండోర్, కోల్‌కతా నుంచి వెళ్లే 18 విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
గోఎయిర్ ఏమంటోందంటే..
విమాన సర్వీసుల అంతరాయంపై గోఎయిర్ అధికారిక ప్రకటనలో చాలా కారణాలను పేర్కొంది. 'వాతావరణం సరిగ్గా లేకపోవడం, మంచు ప్రభావం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తదితర కారణాలతో గోఎయిర్ నెట్‌వర్క్‌లోని పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు సిబ్బంది డ్యూటీ నిబంధనలు సర్వీసులపై ప్రభావం చూపిస్తున్నాయి' అని ప్రకటనలో తెలిపింది. ఎన్ని విమానాలు రద్దయ్యాయనే విషయాన్ని మాత్రం గోఎయిర్ అధికారికంగా వెల్లడించలేదు.
ప్రయాణికుల ఇక్కట్లు..
విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీసులు రద్దు చేస్తున్నట్లు గోఎయిర్ ఆకస్మికంగా ప్రకటించిందని, హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించట్లేదని ఓ ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గోఎయిర్ స్పందిస్తూ.. ప్రత్యామ్నాయ విమానాల కోసం.. ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. అంతేగాక.. ప్రయాణికులకు ఉచిత విమాన టికెట్ల రద్దు, రీబుకింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
మరో విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. వాతావరణ ప్రతికూలతల వల్ల పలు విమానాల రాకపోకలపై ప్రభవం పడిందని ట్విట్టర్లో తెలిపింది. తమ విమాన సర్వీసుల స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని ప్రయాణికులను కోరింది.
ఇదీ చూడండి:2020లో కొత్త ఉద్యోగాలు కష్టమే..!