ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు, జీడీపీ గణాంకాల ప్రభావమే అధికంగా ఉండనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం భయాలు.. ఇందులో ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు.
దేశీయంగా చూస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మదుపరులు దృష్టి సారించొచ్చని నిపుణుల అంచనా. మార్కెట్లలో నవంబర్ డెరివేటివ్స్ ఈ వారాంతంతో ముగియనున్నాయి. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాల్లో ఇదీ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
"ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రభుత్వం ప్రకటించే పాలసీలు.. పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ పరిణామాలు వంటివి ప్రభావం చూపించే అవకాశముంది." - జిమిత్ మోదీ, సీఏఎంసీఓ వ్యవస్థాపకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలపైనా.. మదుపరులు అధికంగా దృష్టి సారించే అవకాశముందని జియోజిత్ ఫినాన్షియల్ సర్విసెస్.. అధిపతి వినోద్ నాయర్ అన్నారు. ఈ శుక్రవారం మార్కెట్ సమయంలోనే జీడీపీ గణాంకాలు వెలువడే అవకాశముంది.
పలు రేటింగ్ సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో.. దేశ జీడీపీ అంచనాలు ప్రతికూలంగా ఉండటం మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.
ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ వంటివీ మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:ఆర్‌కామ్‌కు అనిల్ అంబానీ రాజీనామా చెల్లదు!