కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాల్లో అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ విమానయాన రంగంపై ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉండనుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) వెల్లడించింది. 2020 ఆర్థిక ఏడాదిలో దాదాపు 252 బిలియన్ డాలర్ల మేర ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది 2019 ఆదాయంతో పోలిస్తే 44 శాతం తక్కువ.
"113 బిలియన్ల డాలర్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని మార్చి 5న అంచనా వేశాం. ఇది కొవిడ్-19 విస్తృతి ఎక్కువ ఉన్న సమయంలోని లెక్కలే. కానీ ప్రస్తుతం ఉన్న ప్రయాణ ఆంక్షలు అప్పుడు లేవు. ఇదే పరిస్థితి మరో మూడు నెలలు కొనసాగితే 38 శాతం డిమాండ్ తగ్గిపోయి.. 252 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది."
-అలెగ్జాండర్ డి జునియాక్, డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్
ఆర్థికంగా ఆదుకోవాలి..
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పలు దేశాలు తమ అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేశాయి. భారత్‌లోనూ అంతర్జాతీయ విమానాలతో సహా దేశీయ సర్వీసులను మార్చి 31 వరకు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరుతోంది ఐఏటీఏ. ఆర్థిక ఉపశమన చర్యలు లేకపోతే ఈ రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ విమాన రద్దీలో 80 శాతం ఉండే దాదాపు 290 ఎయిర్లైన్లకు ఐఏటీఏ ప్రాతినిథ్యం వహిస్తోంది.
ఇదీ చూడండి: భారత్ లాక్డౌన్: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే