వినియోగదారులు కొన్ని వస్తువులనైనా ప్రత్యక్షంగా తాకి కొనుగోలు చేసే అనుభూతిని పొందాలని ఆకాంక్షిస్తోంది దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. స్థానిక చిల్లర వ్యాపారులను భాగస్వాములుగా చేసుకుని వినియోగదారులకు చేరువ కావాలనుకుంటుంది.
ఆన్లైన్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వస్తువులపై భారీ డిస్కౌంట్ ప్రకటించి వినియోగదారులను మోసం చేసి, అక్రమాలకు పాల్పడుతున్నారని వీటిపై ఆరోపణలూ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ-కామర్స్‌కు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆలోచనతో ఆయా ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్ కిరాణా స్టోర్ల లాభాలను కొల్లగొట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోెంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్, 700 నగరాల్లో 27 వేల కిరాణా దుకాణాలకు ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది.
ముందుగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసి, వారికి దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్లి ఉత్పత్తిని చూసి, కొనుగోలు చేసే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారిక కొనుగోళ్ల జోన్లకు ఈ ప్రతిపాదన చేసింది ఫ్లిప్‌కార్ట్ సంస్థ.
హైదరాబాదులో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన చరవాణి ఉత్పత్తుల అమ్మకం విజయవంతమైంది. 'ముందుగా చరవాణిలోని కియోస్కీ యాప్‌లో ఆర్డర్ చేసుకోవాలి. తర్వాత వారికి అందుబాటులో ఉన్న దుకాణాలకు వెళ్లి వస్తువులు పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చని' సంస్థ ముఖ్య కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజినీశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ విధానాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో ఈ-కామర్స్ వాటా 3 శాతం మాత్రమేనని కుమార్ అన్నారు.
ఇదీ చూడండి: గో ఎయిర్ నూతన సీఈఓగా వినయ్ దూబె