తమ ప్లాట్ ఫారంపై వార్తల కోసం ప్రత్యేక ట్యాబ్‌ను తీసుకురానున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ మరోసారి స్పష్టం చేసింది. సీనియర్ జర్నలిస్టుల పర్యవేక్షణలో ఈ వార్తలను ఎడిట్ చేయనున్నట్లు పేర్కొంది.
యూజర్‌కు ఎలాంటి కంటెంట్ వెళ్లాలో నిర్ణయించేందుకు ఇప్పటివరకు అల్గారిథమ్స్నే నమ్ముతూ వస్తోంది ఫేస్బుక్. అందుకు భిన్నంగా... వార్తల నిర్వహణకు పాత్రికేయులను నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ జట్టు విశ్వసనీయమైన, టాప్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వంటి విభాగాల్లో వార్తా కథనాలను ఎంపిక చేస్తుందని వెల్లడించింది.
"న్యూస్ ట్యాబ్ ద్వారా యూజర్లకు అవసరమైన, సందర్భోచితమైన సమాచార అనుభూతిని అందివ్వడమే మా ప్రధాన లక్ష్యం. ప్రముఖ కథనాలను చూపించేందుకు జర్నలిస్టు బృందాన్ని ఎంచుకున్నప్పటికీ.. యూజర్లు ఎలాంటి వార్తలు చదువుతున్నారు, వారికి ఎలాంటి న్యూస్ అందివ్వాలి అనేది సాఫ్ట్వేర్ ద్వారానే గుర్తిస్తాం."
-క్యాంప్‌బెల్ బ్రౌన్, ఫేస్బుక్ న్యూస్ భాగస్వామ్య అధిపతి
ప్రస్తుతం ఫేస్బుక్ న్యూస్ ప్రారంభదశలోనే ఉన్నా.. ఈ ఫీచర్‌పై తాము చాలా నమ్మకంగా ఉన్నట్లు బ్రౌన్ పేర్కొన్నారు. ఫేస్బుక్ న్యూస్ యూజర్లకు సరికొత్త అనుభూతి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.