కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా సుమారు రూ.9 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దేశ జీడీపీలో ఇది 4 శాతం ఉంటుందని చెబుతున్నారు.
వృద్ధిరేటు 3.5 శాతమే!
మూడు వారాల లాక్‌డౌన్ కారణంగా రూ.6.75 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్ల్కేస్ అంచనా వేసింది. మహారాష్ట్ర సహా పలురాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్ కారణంగా ఈ నష్టం మరింత పెరుగుతుందని హెచ్చరించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధిరేటు అంచనాలను 1.7 శాతం తగ్గించి 3.5 శాతానికి పరిమితం చేసింది.
ఆ విషయంలో భేష్..
మిగతా దేశాలకంటే కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించిందని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఎంకే తెలిపింది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాని కోరింది. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి చిన్న తరహా వ్యాపారాలకు రుణాల మంజూరును సులభతరం చేయడం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ, నగదు బదిలీ తదితర చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని సూచించింది.
ఎయిర్ ఇండియా నష్టం రోజుకు రూ.35 కోట్లు!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విమానయాన సంస్థల సేవలు స్తంభించాయి. ఈ కారణంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు రోజుకు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల మేర నష్టం వాటిల్లొచ్చని అంచనా వేస్తున్నారు.
"ప్రస్తుతం ఒక్క విమానం కూడా నడిపించేందుకు వీలు లేదు. ఇలాంటి సమయాల్లోనూ ఉద్యోగులకు జీతాలు, లీజులకు అద్దెలు, కనీస నిర్వహణ ఖర్చులు వంటివి తప్పదు. ఫలితంగా ఈ మేరకు నష్టాలు రావచ్చు." అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్యాకేజీపై ఆశలు..
లాక్‌డౌన్ ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని తెలిసినా.. ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అంశాన్నిపరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక ప్యాకేజీ రూపకల్పన జరుగుతున్నట్లు మంగళవారం ఇచ్చిన సంకేతాలతో పరిశ్రమ వర్గాల్లో ఆశలు రేపుతోంది.
ఇదీ చూడండి:ఆపరేషన్ కరోనా: ఆ ఔషధం ఎగుమతులపై నిషేధం