LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే వారం ప్రభుత్వం సెబీకి సమర్పించే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ఎల్‌ఐసీ విలువను లెక్కగట్టినట్లు వెల్లడించారు. బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఇష్యూ పరిమాణం, వాటా విక్రయ వివరాలను తెలిపే ముసాయిదా పత్రాల(డీఆర్‌హెచ్‌పీ)ను 7-10 రోజుల్లో సెబీకి సమర్పిస్తామని వివరించారు. సెబీ అనుమతులు లభిస్తే, మార్చిలో ఇష్యూ జరిగే వీలుంటుందని పేర్కొన్నారు.
పాలసీదార్లకు 10 శాతం కేటాయింపు
ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమీకరించదలచిన లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్ల నుంచి భారీగా తగ్గించి, రూ.78,000 కోట్లకు ప్రభుత్వం పరిమితం చేసింది. దీన్ని అందుకోవాలన్నా ఎల్‌ఐసీ నమోదు కేంద్రానికి కీలకం కానుంది. ఇప్పటిదాకా ఎయిరిండియా ప్రైవేటీకరణ, ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.12,030 కోట్ల వరకు సమీకరించింది. ఎల్‌ఐసీ ఇష్యూలో కొంత భాగాన్ని యాంకర్‌ఇన్వెస్టర్లకు కేటాయిస్తామని, 10 శాతం వరకు షేర్లను పాలసీదార్లకు కేటాయిస్తామన్నారు.
మంత్రిమండలికి ఎఫ్‌డీఐ ప్రతిపాదన త్వరలో: ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించేలా విధానంలో మార్పులకు ఆమోదం తెలపాల్సిందిగా కోరుతూ పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) మంత్రిమండలికి ప్రతిపాదన పెట్టనుంది. ఈ విషయంలో అంతర్ మంత్రిత్వ శాఖల చర్చలు తుది దశలో ఉన్నాయని డీపీఐఐటీ కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు.
ఎందుకంటే: సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూలో ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉంటాయి. బీమా రంగంలోకి 74 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అయితే ఎల్‌ఐసీ చట్టం ద్వారా నడుస్తున్న ఎల్‌ఐసీకి ఇవి వర్తించవు. అందుకే సవరణలు చేయాల్సి ఉంది.
ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ రూ.64,722 కోట్లు
అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద బీమా బ్రాండ్
ఎల్‌ఐసీ బ్రాండ్ విలువను 8.656 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.64,722 కోట్లు) అని లండన్‌కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ లెక్కగట్టింది. దేశంలోనే బలమైన, అతిపెద్ద బ్రాండ్ ఇదేనని.. అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద బీమా బ్రాండ్ అని తెలిపింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం..
- ఎల్‌ఐసీ మార్కెట్ విలువ 2022 కల్లా రూ.43.40 లక్షల కోట్లు లేదా 59.21 బి. డాలర్లకు; 2027 కల్లా రూ.58.9 లక్షల కోట్లు లేదా 78.63 బిలియన్ డాలర్లకు చేరొచ్చు.
- 2020లో ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ మొత్తం అంతర్జాతీయ బ్రాండ్ ర్యాంకుల్లో ప్రపంచంలో 238వ స్థానంలో ఉండగా.. 2021 నాటికి 32 స్థానాలు మెరుగుపరచుకుని 206వ స్థానానికి చేరింది.
- 2020లో 8.11 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ 6.8 శాతం వృద్ధితో 2021కి 8.655 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా అగ్రగామి 100 బీమా కంపెనీల బ్రాండ్ విలువ 6 శాతం మేర(462.4 బి. డాలర్ల నుంచి 433 బి. డాలర్లకు) క్షీణించడం గమనార్హం.
- బ్రాండ్‌కున్న బలం పరంగా దేశీయంగా 84.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా.. అంతర్జాతీయ మూడో స్థానంలో నిలిచింది. పోస్ట్ ఇటాలిన్(ఇటలీ), మాప్‌ఫ్రె(స్పెయిన్)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- అగ్రగామి 10 కంపెనీల్లో 5 చైనా బీమా కంపెనీలుండగా.. రెండు అమెరికా నుంచి; ఫ్రాన్స్, జర్మనీ, భారత్ నుంచి ఒక్కోటి ఉన్నాయి. 26 శాతం మేర బ్రాండ్ విలువను కోల్పోయినా పింగ్ యాన్ ఇన్సూరెన్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైన బీమా కంపెనీగా నిలిచింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: India Cryptocurrency: దేశీయ క్రిప్టో కరెన్సీకి ఏ పేరు పెడతారు?