బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగోకు పౌర విమానయాన డెరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఇంజిన్ల మార్పుపై మరో సారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండిగోకు చెందిన.. 23 ఏ320 నియో విమానాల్లో ప్రాట్ అండ్ విట్నే (పీడబ్ల్యూ) ఇంజిన్లను మార్చాలని సూచించింది. నవంబర్ 19 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే వాటి కార్యకలాపాలు నిలిపివేస్తామని హెచ్చరించింది డీజీసీఏ.
ఇండిగో వద్ద ఉన్న 97 విమానాలకు.. వచ్చే ఏడాది జనవరి 31లోగా పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాలని సూచించింది డీజీసీఏ. గత వారం నాలుగు ఇండిగో ఏ320 నియో విమానాల ఇంజిన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిపై సోమవారమే ఇండిగోకు అదేశాలు జారీ చేసింది డీజీసీఏ. 2900 గంటలకు పైగా వాడిన 16 విమానాల ఇంజిన్లను మాత్రమే మార్చాలని తొలుత సూచించింది. వీటికి నవంబర్ 12 వరకు గడువు విధించింది. అయితే మరో ఏడు విమానాలు ఇదే రకమైన ఇంజిన్తో పని చేస్తున్నట్లు గుర్తించి.. వాటితో కలిపి తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఆటో రంగానికి కలిసొచ్చిన పండుగ సీజన్