అమెరికాతో కొన్నేళ్లుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, కరోనా తెచ్చిన సంక్లిష్ట పరిస్థితి .. చైనాలోని అంతర్జాతీయ సంస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి తమ పరిశ్రమలను తరలించాలని ప్రయత్నిస్తున్నాయి అక్కడి సంస్థలు. అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను స్వదేశానికి తరలిస్తే పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో. కార్పొరేట్ పన్నును 50 శాతానికి తగ్గించాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలతో చైనాకు గుడ్‌బై చెప్పే సంస్థలను స్వదేశానికి వచ్చేలా చూసేందుకు అగ్రరాజ్యం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
" ప్రస్తుతానికి ఇది కార్యరూపం దాల్చలేదు. కానీ, పని చేసేందుకు అమెరికాను అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. శిక్షించకుండా ప్రోత్సహించాలనే అంశాన్ని నేను నమ్ముతాను. చైనా నుంచి అమెరికాకు పరిశ్రమలను తరలించే వారికి కార్పొరేట్ పన్ను 50 శాతం ఎందుకు తగ్గించకూడదు? ప్రస్తుతం ఉన్న 21 శాతం నుంచి 10.5 శాతానికి తగ్గించాలి. కొన్నేళ్లపాటు 10.5 శాతం పన్ను తగ్గింపు ఇస్తే.. అది మనల్ని పోటీలో నిలుపుతుంది, కొత్తపెట్టుబడులకు ఆతిథ్యమిస్తుంది. సంస్థలను తరలించేందుకు పూర్తిస్థాయిలో 100 శాతం వ్యయం చేయాల్సిన అవసరం లేదు. మేము కొంత సాయం చేస్తాము. "
– లారీ కుడ్లో, శ్వేతసౌధం జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్
కరోనా మహమ్మారిని నియంత్రించే విషయంలో చైనాపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది అమెరికా. అంతే కాకుండా అమెరికా సాంకేతికతను, పరిశోధనల సమచారాన్ని దొంగిలిస్తుందని ఆరోపిస్తోంది. ఇటీవలే చైనాపై ఆంక్షలు విధించేందుకు 18 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు అమెరికా సెనేటర్ ఒకరు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందన్న ఆరోపణపై దర్యాప్తు చేసేందుకు చైనా అనుమతించాలని పలు సందర్భాల్లో పేర్కొన్నారు ట్రంప్.
ఇదీ చూడండి: చైనాకు గుడ్‌బై చెప్పే సంస్థలపై భారత్ గురి