ఒక వినూత్న ఆలోచన.. ఆవిష్కరణ.. సరికొత్త సాంకేతికత.. దానిద్వారా సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాలన్న తపనతో అనేక అంకురాలు పుట్టుకొచ్చాయి. ఆదాయాలు అంతంతే ఉన్నా.. భవిష్యత్తు మీద కొండంత ఆశ, ధైర్యంతో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానం చూపించిన ఈ సంస్థలు కరోనా వైరస్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు తల్లడిల్లుతున్నాయి. రావాల్సిన ఆదాయాలు ఆగిపోవడం, పెట్టుబడిదారులు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాయి.
కరోనా వైరస్ విజృంభణకు దేశ ఆర్థిక వ్యవస్థలే అల్లాడిపోతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలూ.. ఆదాయ మార్గాలు మూసుకుపోవడం వల్ల సందిగ్ధంలో పడిపోయాయి. ఎక్కడ చూసినా.. వేతనాల కోత, సిబ్బంది తగ్గింపులాంటి వార్తలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అంకురాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారులు వస్తుంటూనే వీటికి మనుగడ. ప్రస్తుత సంక్షోభంతో రెండు మూడు నెలలుగా వీటికి వినియోగదారులు కరవయ్యారు.
ఆదాయం కనిపించడం లేదు..
కొత్తగా వినియోగదారులు రాకపోవడం, ఇప్పటికే ఉన్నవారు సేవలను వినియోగించుకుంటున్నా ఇవ్వాల్సిన డబ్బును తర్వాత ఇస్తాం అంటూ వాయిదా వేస్తుండటంతో అంకురాల ఆదాయం దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పాలి. కొన్నింటికి మార్చిలో కొంత మేరకు వచ్చినా.. ఏప్రిల్‌లో ఒక్క రూపాయీ రాని పరిస్థితులున్నాయి.
ఆరు నెలల తర్వాత చూద్దాం..
అంకురాలకు పెట్టుబడులే కీలకం. కరోనాకు ముందు వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అనేక మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు ఇప్పుడు వాటివైపే చూడటం లేదు. ఇస్తామని హామీ ఇచ్చిన పెట్టుబడులూ ఆగిపోయాయి. కొవిడ్-19 సంక్షోభం ముగిసిన తర్వాత.. ఏ సంస్థలు నిలదొక్కుకున్నాయో... భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు వచ్చినా తట్టుకుంటాయా అనేది బేరీజు వేసుకొని, అప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త పెట్టుబడులు రావాలంటే.. కనీసం ఆరు నెలలు పడుతుంది. అప్పటిదాకా సంస్థలను సాధ్యమైనంత వరకూ నడిపించడమే ఇప్పుడు అంకురాలకు కఠిన పరీక్షగా మారింది.
విలువ తగ్గుతోంది..
ఆదాయం పడిపోవడం, కొత్త వినియోగదారులు లేకపోవడంతో వృద్ధి చూపించడం సాధ్యం కాదు. ఫలితంగా పెట్టుబడిదారులకు సంస్థ పనితీరును విశ్లేషించేటప్పుడు గణాంకాలు ఆశాజనకంగా కనిపించడం లేదు. దీంతో సంస్థ విలువ తగ్గిపోతోంది. ముఖ్యంగా ఆఫ్‌లైన్ సేవలనందించే వాటికి ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. కరోనాకు ముందున్న కంపెనీ విలువ ఇప్పుడు దాదాపు 25-30శాతం వరకూ తగ్గిపోయింది. మళ్లీ దీన్ని నిలబెట్టాలంటే ఎంతో శ్రమించాల్సిందేననేది వ్యవస్థాపకుల మాట. పూర్వ స్థాయిలో కనీసం రెండేళ్లపాటు పనిచేస్తేనే.. ఇది సాధ్యమని పేర్కొంటున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న రంగాలకు తోడుగా మరో కొత్త ఆలోచనతోనూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
వెలుగు.. చీకట్లు...
కరోనా కష్టకాలంలోనూ కొన్ని అంకురాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, ఒకే రంగంలో ఉన్న అన్ని సంస్థల పరిస్థితి ఒకే విధంగా లేదని చెప్పాలి. ఉదాహరణకు ఫిన్‌టెక్ రంగంలో ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు, ఇతర సాంకేతికతలపైన పనిచేసేవి ప్రస్తుతం వెలుగులోకి రాగా.. పీ2పీ రుణాలు, ఇతర విధానల్లో అప్పులు ఇచ్చే సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఎడ్యుటెక్ అంకురాల్లో... ఆన్‌లైన్ ట్యూషన్లు, కోచింగ్‌లు ఇచ్చే వాటికి ఆదరణ పెరుగుతోంది. వీటి వ్యాపారాలు 200 శాతం వరకూ వృద్ధి చెందాయి. అదే సమయంలో పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన సాంకేతికతను అందించేవి కుదేలయ్యాయి. వీటికి రెండు మూడు నెలలుగా ఆదాయమే రావడం లేదు. టెలీ మెడిసిన్ వ్యాపారంలో ఉన్న అంకురాల పంట పడిందనే చెప్పాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి.. సంక్షోభ సమయంలో అంకురాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయా సంస్థలకు రావాల్సిన ప్రోత్సాహకాల విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‌టీ, ఆదాయపు పన్ను రిఫండులను వెంటనే చెల్లించడంతోపాటు, కార్పొరేట్లు సామాజిక బాధ్యత కింద వెచ్చించే నిధుల్లో కొంత అంకురాలకు కేటాయించాలని నిబంధన పెట్టాలని, నమోదైన స్టార్టప్‌లకు కనీసం రూ.20లక్షల వరకూ గ్రాంటులు ఇవ్వాలని అంకురాలు అడుగుతున్నాయి.
నిధులు ఎలా?
సంస్థ నిర్వహణ కోసం కనీసం 6-10 నెలల వరకూ నిర్వహణ మూలధనాన్ని ఆయా సంస్థలు పెట్టుకోవడం పరిపాటి. చాలా అంకురాలకు ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒక సర్వే నివేదిక ప్రకారం దాదాపు 6 శాతం అంకురాల దగ్గరే ఆరేడు నెలలకు సరిపడా నిధులు ఉన్నాయి. 27 శాతానికి పైగా సంస్థల దగ్గర నగదు నిండుకుంది. ఈ నేపథ్యంలో సంస్థల నిర్వహణ ఎలా అనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలను చెల్లించకుండా, పరిస్థితులు మెరుగయ్యేదాకా వేచి చూడటమే తమ ముందున్న ఏకైక మార్గమని అవి భావిస్తున్నాయి. దీంతోపాటు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారు ఆయా సంస్థల వ్యవస్థాపకులు. చాలా వరకు సంస్థలు కో వర్కింగ్ ప్లేస్ నుంచి పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్ తర్వాత ఇంటి నుంచే పనిచేస్తుండటంతో ఆయా పని ప్రదేశాలను వినియోగించుకోవడం లేదు. దీంతో అద్దె చెల్లించలేమని చెబుతున్నామని ఒక సంస్థ ప్రతినిథి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'మే 17 వరకు విమాన సేవలు పునరుద్ధరించరాదు'