వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న పన్ను లక్ష్యాలు అందుకోగలిగే స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ (సీబీడీటీ) పి.సి.మోదీ అన్నారు. కార్పొరేట్ పన్ను వసూళ్లు ఊహించినదాని కంటే వేగంగా కొవిడ్-19 ముందున్న స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. ప్రజలే పన్నులు స్వచ్ఛందంగా కట్టేలా ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొచ్చిందని, వారికి మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇదేక్రమంలో పన్ను ఎగవేతదార్లపై కఠిన చర్యలు తప్పవని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యాంశాలు ఇలా..
2021-22 పన్ను లక్ష్యాలు సాధించగలిగే రీతిలోనే ఉన్నాయా?
అందుకోగలిగే స్థాయిలో, వాస్తవ రీతిలోనే ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఇవి భారీ లక్ష్యాలేమీ కావు. అలాగని సాధించలేనివి కూడా కావు.
ఈ ఏడాది పన్ను అధికారుల దర్యాప్తులు, దాడులు పెరిగాయి. పన్ను చెల్లింపుదార్లతో స్నేహపూర్వక ధోరణి కనబరుస్తామన్న విధానానికి ఇది విరుద్ధం కాదా?
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి సేవలందిస్తూనే, ఎగవేతదార్లపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ముందస్తుగా వివరాలు నింపడంతో, ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేయడం సులభమవుతుంది. ఒకవేళ మదింపు ప్రక్రియ అవసరమైనా, ఆదాయపు పన్ను కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే పారదర్శకంగా జరిగేలా చూస్తున్నాం. దీనిపై అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఏర్పరచడంతో, విజయవంతంగా అమలవుతోంది. చట్టంలోని లొసుగుల సాయంతో కొందరు మాత్రం పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. మెరుగైన సేవలు అందించేందుకు పన్ను చెల్లింపుదార్ల అభిప్రాయాలను ఆన్‌లైన్ ద్వారా సేకరిస్తున్నాం.
ప్రభుత్వాదాయం పెరిగేందుకు వివాద్ సే విశ్వాస్ పథకం ఉపయోగ పడిందా?
పన్ను వివాదాలను తగించాలనేదే ఈ పథక ఉద్దేశం. తక్కువ సమయంలో పన్ను చెల్లింపుదార్లు తమ సమస్య పరిష్కరించుకునేందుకు ఇది ఉపయోగ పడింది. కొవిడ్ వల్ల కాలం పొడిగించామే కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించాల్సిన అవసరం లేదు.
కార్పొరేట్ పన్ను వసూళ్లు ఎందుకు తగ్గాయి?
పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు తగ్గాయి. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్-19 ముందు నాటి కంటే కూడా మెరుగైన స్థితికి చేరే అవకాశం కన్పిస్తోంది. అందువల్ల కార్పొరేట్ పన్నుల వసూళ్లు కూడా పెరుగుతాయనే నమ్మకం ఉంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఊరట ఉంటుందని ఆశించారు. కానీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్లలేదు. ఎందుకని?
గతేడాది బడ్జెట్లో పన్నుల హేతుబద్ధీకరణకు ప్రయత్నించాం. పన్ను రేట్లలో మార్పులు చేయాలంటే తప్పనిసరి పరిస్థితులు లేదా ఏదేని సందర్భం ఉండాలన్నది నా అభిప్రాయం. కరోనా నేపథ్యంలో గతేడాదిని మనం ఓ ప్రత్యేక సంవత్సరంగా చూడాలి. అయితే పన్ను రేట్లను మరింతగా తగ్గించాలనే డిమాండ్లు పెద్దగా రాలేదు. అదనపు మినహాయింపులు లేదా తగ్గింపులను దశలవారీగా రద్దు చేసి, కార్పొరేట్ పన్నుల మాదిరి ఆదాయపు పన్ను రేట్లను కూడా ప్రస్తుత స్థాయి కంటే, కిందకు తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. తరచు పన్ను రేట్లలో మార్పులు చేయడం వల్ల పన్ను చెల్లింపుదార్ల ఆలోచనలోనే అనిశ్చితి ఏర్పడుతుంది.
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి గాను మొత్తం పన్నుల వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల వాటా ఎక్కువగా ఉంటుందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది సబబుగా అనిపిస్తోందా?
మొత్తం వసూళ్లలో ఎప్పుడూ ప్రత్యక్ష పన్నుల వాటానే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి పరోక్ష పన్నుల వాటా ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి తాత్కాలికమే. పన్ను విధానాల్లో సంస్కరణలతో ప్రజల ధోరణుల్లో మార్పు వస్తోంది. స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నందున, ప్రత్యక్ష పన్నులు కూడా పెరుగుతాయి.
కేంద్ర ప్రత్యక్ష-పరోక్ష పన్నుల బోర్డులు వివరాలు పంచుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. ఏమి చేయబోతున్నారు?
మేం ఇప్పటికే సీబీఐసీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెబీతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాం. మూలధన లాభాలపై స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ నుంచి మాకు సమాచారం వస్తే.. దానిని పన్ను చెల్లింపుదారుకు అందుబాటులో ఉంచుతాం. రిటర్న్‌లను సరిగ్గా నింపే విషయంలో పన్ను చెల్లింపుదార్లకు ఇది ఉపయోగపడుతుంది. కేసుల పరిశీలనకు ఇప్పటికే నోట్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని వాడుతున్నాం.
వొడాఫోన్, కెయిర్న్ కేసుల్లో వచ్చిన తీర్పుల నేపథ్యంలో మన రెట్రోస్పెక్టివ్ పన్నుల విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా?
వొడాఫోన్ కేసులో ఇప్పటికే అప్పీల్‌కు వెళ్లాం. కెయిర్న్ వ్యవహారం పరిశీలనలో ఉంది. రెట్రోస్పెక్టివ్ పన్నుల విధానం భారత్‌లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఉంది. ఒక దేశ పన్ను పరిధిలో వ్యాపారం చేసినప్పుడు.. అక్కడి చట్టాల ప్రకారం పన్ను విధించే హక్కు ఆ దేశానికి ఉంటుంది.
గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు దేశీయంగా చేస్తున్న వ్యాపారంతో పోలిస్తే, వారి నుంచి వసూలవుతున్న పన్ను తక్కువగా ఉంటోంది?
పన్ను విధింపులో సమానత్వం చూపుతున్నాం. ఇకామర్స్ దిగ్గజాలకు దేశీయ విపణి అందుబాటులో ఉన్నా, వారు పన్ను చెల్లించడం లేదు. అందుకే బడ్జెట్‌లో దీనిపై స్పష్టత తెచ్చాం. ఇతర దేశాలతోనూ ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాం.
ఇదీ చూడండి: క్రిప్టో కరెన్సీపై త్వరలో కేంద్రం బిల్లు