హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ కొవిడ్-19 టీకాపై మూడో దశ క్లినికల్ పరీక్షలు చేపట్టనుంది. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఈ మూడో దశ క్లినికల్ పరీక్షలు ఆగస్టు నాటికి పూర్తవుతాయని, ఆ తర్వాత వెంటనే టీకా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది రెండు డోసుల టీకా. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలి. మూడో దశ క్లినికల్ పరీక్షలను దేశవ్యాప్తంగా 15 ప్రదేశాల్లో నిర్వహిస్తారు. 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులైన 1,268 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
త్వరలో మూడో దశ..
కొవిడ్-19 టీకాపై బయోలాజికల్ ఇ.లిమిటెడ్ గత ఏడాది నవంబరులో మొదటి/ రెండో దశ క్లినికల్ పరీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ టీకాలోని యాంటిజెన్‌ను టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ అభివృద్ధి చేసింది. అనంతరం దీన్ని బీసీఎం వెంచర్స్, డైనావ్యాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌కు చెందిన అడ్వాన్స్డ్ అడ్జువంట్ (సీపీజీ 1018) సహా బయోలాజికల్ ఇ.లిమిటెడ్ తీసుకుంది. మొదటి/రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణలో బయోలాజికల్ ఇ.లిమిటెడ్‌కు ఎపిడమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ మద్దతు ఇచ్చాయి. ఈ సంస్థలే మూడో దశ క్లినికల్ పరీక్షల విషయంలోనూ బయోలాజికల్ ఇ.కి అండగా నిలుస్తున్నాయి.
మొదటి/ రెండో దశ పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో దీనిపై మూడో దశ పరీక్షల నిర్వహణకు సబ్జెక్టు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల్లో ఈ టీకా భద్రమైనదని తేలిందని బయోలాజికల్ ఇ.ఎండీ మహిమా దాట్ల పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాధిని ఎదుర్కొనటంలో తమ టీకా మరో సమర్థమైన పరిష్కారం అవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తక్కువ ఆదాయాలు కలిగిన ఆసియా దేశాల్లో కరోనాను ఎదుర్కొనేందుకు ఈ టీకా దోహదపడుతుందని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: కొవాగ్జిన్ ధర ప్రకటించిన భారత్ బయోటెక్