ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో తయారైన సెల్టోస్ కారును బెంగళూరులో ఆవిష్కరించారు కియా మోటార్స్ ఇండియా. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అధిపతి మనోహర్ భట్. అనంతరపురంలో కర్మాగారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై స్పందించారు.
"భారత్‌లో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. ఏటా 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్‌లో కియా వాటా 1000లో 30 వరకు ఉండే అవకాశం ఉంది. అదే చైనాలో 1000లో 100 కార్లు కియావే.
భారత్‌లో ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది. వాహన రంగంలో మందగమనం శాశ్వతం కాదు.
కర్మాగారం ప్రారంభించడానికి రవాణా, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలన్ని పరిగణనలోకి తీసుకున్నాం. అందుకే అనంతపురాన్ని ఎంపిక చేశాం. మాకు ఏ ప్రభుత్వంతోనూ ఇబ్బంది కలగలేదు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి పూర్తిగా సహకారం లభించింది. అధికారులు వేగంగా స్పందించారు.
కియా ఎలక్ట్రానిక్ వాహనాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు నడిచే కార్లు అమెరికా, కొరియా మార్కెట్లలో లభిస్తున్నాయి. దేశంలో డిమాండ్ ఉండి.. అందుకు ప్రభుత్వ సహకారం లభిస్తే అనంతపురంలోనే వాటిని తయారు చేస్తాం.
ప్రతి ఆర్నెల్లకు కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఇక్కడి కర్మాగారం నుంచి మొదటగా దేశీయ అవసరాలకే ఉత్పత్తి చేస్తున్నాం. తర్వాత అవకాశం ఉంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తాం."
-మనోహర్ భట్, కియా సేల్స్, మార్కెటింగ్ అధిపతి
ఇదీ చూడండి: మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్రా' కియా కారు