టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో సొంత ఆఫ్‌లైన్ స్టోర్‌ను 2021లో ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఆన్‌లైన్ అమ్మకాలు మాత్రం ఈ ఏడాది నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. తమ అధికారిక ఈ-స్టోర్ ద్వారా యాపిల్ ఉత్పత్తులను విక్రయిస్తామని కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ భాగస్వామ్యపక్షాల వార్షిక భేటీలో యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ప్రకటించారు. భారత్‌లో తామే సొంతంగా యాపిల్ స్టోర్ ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వేరే వారి చేతుల్లో తమ ఉత్పత్తులను పెట్టాలనుకోవడం లేదని కుక్ అన్నారు.
మారిన నిబంధనలతో..
దేశంలో ఇప్పటివరకు అమెజాన్, క్రోమా వంటి థర్డ్ పార్టీల ద్వారా యాపిల్ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. భారత్‌లో సొంతంగా విక్రయాలను ప్రారంభించేందుకు యాపిల్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, గతంలో ఉన్న నిబంధనల కారణంగా యాపిల్ భారత్‌లో సొంతంగా విక్రయించలేకపోయింది. విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో కేంద్రం తీసుకువచ్చిన మార్పులతో మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది యాపిల్.
భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ముంబయిలో ప్రారంభించబోతున్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యాపిల్ మాత్రం తొలి స్టోర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నది అధికారికంగా వెల్లడించలేదు.
ఇదీ చూడండి:కరోనా క్రాష్: ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లు హాంఫట్