అక్షయ తృతీయ సందర్భంగా బంగాలు కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ఈ పర్వదినాన ఎంతో కొంత పసిడిని కొనుక్కుంటారు. సాధారణ రోజుల్లో కంటే ఈ పండగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయటం.. ప్రస్తుత లాక్డౌన్లో కూడా అందుబాటులో ఉంది. అయితే సాధారణంగా పండగ సందర్భంగా భౌతిక బంగారం కొనుగోలుకు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. దీనితో మరో విధంగా ఈ కొనుగోళ్లకు అవకాశం ఇచ్చేందుకు జ్యూవెల్లరీ సంస్థలు వినూత్నమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికెట్లు...
మాములుగా బంగారం విక్రయాలు ఎక్కువగా దుకాణాల ద్వారానే జరుగుతుంటాయి. ప్రస్తుతం పండగ సందర్భంగా కొన్ని సంస్థలు గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికేట్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో బంగారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ విజయవంతంగా పూర్తయినట్లయితే.. వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా అక్షయ తృతీయ నాడు ఈ ధ్రువీకరణ పత్రం వినియోగదారుడికి అందుతుంది. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ఈ పత్రాన్ని దుకాణంలో సమర్పించి భౌతికంగా బంగారాన్ని పొందవచ్చు. దీని ద్వారా పండగ సందర్భంగా కొనుగోలు చేసినట్లు అవుతుందని దుకాణదారులు చెబుతున్నారు.
" లాక్డౌన్ వల్ల దుకాణాలు మూసేసి ఉన్నప్పటికీ... అక్షయ తృతీయ నాడు సంప్రదాయం ప్రకారం బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల నుంచి మాకు చాలా వినతులు వచ్చాయి. దీంతో మేము గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ అనే పద్ధతిని తీసుకొచ్చాం. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఆర్డర్ చేసిన అనంతరం వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా అక్షయ తృతీయ నాడు ఈ సర్టిఫికెట్.. వినియోగదారులకు చేరటం అనేది ఇందులో ప్రత్యేకత. ఇలా చేయడం ద్వారా అక్షయ తృతీయ సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించినట్టు అవుతుంది. "
- కళ్యాణరామన్, ఛైర్మన్, ఎండీ, కళ్యాణ్ జ్యువెల్లర్స్
ఆన్లైన్లో..
కొన్ని ఆభరణాల సంస్థలు సాధారణ రోజల్లో ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని.. ఇంటికి బంగారాన్ని లేదా నగలను చేరవేసేవి. ఇప్పుడున్న లాక్డౌన్లో ఆర్డర్లు తీసుకున్నప్పటికీ డెలివరీ చేసే పరిస్థితి లేదు. లాక్డౌన్ ఎత్తేసి కార్యకలాపాలను అనుమితించిన అనంతరమే డెలివరీ చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. మరికొన్ని ఈ తరహా ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కొన్ని జ్యువెల్లరీలు అక్షయ తృతీయ కోసమే ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభించాయి. ఈ పద్ధతి ద్వారా కూడా బంగారం కొనుగోలు చేసినట్లు అవుతుందని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. పండగ సందర్భంగా చిన్న మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.
ఇదీ చూడండి: ఔన్సు బంగారం 3 వేల డాలర్లకు!