ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ఎయిర్టెల్ తొలి దఫాగా రూ.10వేల కోట్లు జమ చేసింది. సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు టెలికాం శాఖ డెడ్‌లైన్‌ను పొడిగించేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బకాయిలు కట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధమయింది.
"భారతీ ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్ తరఫున మొత్తం రూ.10వేల కోట్లు జమచేశాం. స్వీయ పరిశీలన తర్వాత సుప్రీం తదుపరి విచారణకు ముందే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తాం. "
-భారతీ ఎయిర్టెల్
కోర్టు ఆగ్రహంతో కసరత్తు ముమ్మరం..
ఏజీఆర్ బాకాయిలు రూ.1.47 కోట్లు టెల్కోలు చెల్లించాల్సిందేనని.. ఎలాంటి గడువు పెంచే యోచన లేదని సుప్రీంకోర్టు గత వారం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికాం సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఫిబ్రవరి 20న రూ.10,000 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తామని ఎయిర్టెల్ తెలిపింది. అయితే బకాయిల చెల్లింపునకు టెల్కోలకు ఎలాంటి గడువు పెంచే యోచన లేదని టెలికాం శాఖ (డీఓటీ) తేల్చిచెప్పింది.
చర్యలకు సిద్ధమైన డీఓటీ..
ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు టెలికాం సంస్థలకు గత శుక్రవారం అర్ధరాత్రి వరకే గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ సమయానికి బకాయిలు చెల్లించని టెల్కోలపై చర్యలకు సిద్ధమైంది డీఓటీ. శని, ఆది వారాలు సెలవు దినాలు అయినందున సోమవారం నుంచి ఆయా సంస్థలకు నోటీసులు పంపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు డీఓటీ ఇటీవల స్పష్టం చేసింది.