ఉల్లిపాయలు, బంగాళాదుంప లాంటి నిత్యావసరాల ధరల పెరుగుదల కారణంగా టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 3.1 శాతానికి చేరింది. 2019 డిసెంబర్లో ఇది 2.59 శాతంగా ఉంది.
నెలవారీ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం2019 జనవరిలో 2.76 శాతంగా ఉంది.
భారీగా పెరిగిన ఆహార పదార్థాల ధరలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2019 డిసెంబర్లో ఆహార పదార్థాల ధరలు 2.41 శాతం పెరిగితే, జనవరిలో ఆ వృద్ధి ఏకంగా 11.51 శాతంగా ఉంది. ఆహారేతర పదార్థాల ధరలు డిసెంబర్లో 2.32 శాతం పెరగగా, జనవరి నాటికి వాటి ధర 7.8 శాతానికి పెరిగింది.
కూరగాయల ధరలు
జనవరిలో కూరగాయల ధరలు 52.72 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఉల్లి ధర 293 శాతం, బంగాళాదుంప ధర 37.34 శాతం పెరగడమే ఇందుకు కారణం.
ఆరేళ్ల గరిష్ఠానికి
ఈ వారం మొదట్లో, కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారంగా చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్ఠస్థాయి 7.59 శాతానికి చేరింది. 2014 మేలో నమోదైన 8.33 అత్యధిక ద్రవ్యోల్బణం తరువాత ఇదే గరిష్ఠం.
ఇదీ చూడండి: దేశంలో న్యాయముందా?: టెల్కోలపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు