కరోనా సంక్షోభం వల్ల అనేక కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో తమ ఉద్యోగాల్లో కోతలు విధించాయి. కానీ దిగ్గజ అమెజాన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రాబోయే రోజుల్లో కార్పొరేట్, టెక్లకు సంబంధించి.. మొత్తం 33వేల ఉద్యోగులను తీసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించటం విశేషం.
కరోనా కాలంలోనూ లాభాలను ఆర్జించిన కంపెనీల్లో అమెజాన్ ఒకటి. లాక్డౌన్ కాలంలో కిరాణా సరుకులు, ఇతర సామాగ్రి కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి ప్రజలు అమెజాన్ను ఆశ్రయించారు. ఈ-మార్కెట్ ద్వారా ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని, లాభాలను పొందింది సంస్థ. సరుకులను ప్యాక్ చేయటానికి, శుభ్రపరచడం కోసం ఓవర్ టైం చేసిన కార్మికులకు బోనస్ చెల్లించటానికే 4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. వస్తువులను ప్యాక్ చేయటానికి, రవాణా చేయటం కోసం 1,75,000 మంది.. సంస్థ గిడ్డంగుల్లో పని చేస్తున్నారు.
33 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రక్రియను సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభించనుంది. గత ఏడాది 30 వేల నియామకాలను చేపట్టగా.. 2 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది.
జులై నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో నిలిచినట్లు అమెజాన్ ప్రకటించింది. తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన వాల్మార్ట్ సంస్థ ఉంది.