భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ-LIC) ఈ పేరు వినగానే దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ అనేది అందరికీ గుర్తుకు వస్తుంది. కానీ దేశీయ స్టాక్‌మార్కెట్లో(Stock market) ఎల్‌ఐసీ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అనే విషయం ఎక్కువ మందికి తెలియక పోవచ్చు. స్టాక్‌మార్కెట్లో క్రియాశీలకంగా పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం తెలుసు. మార్కెట్ కుప్పకూలినప్పుడు వివిధ కంపెనీల షేర్లను భారీగా కొనుగోలు చేసి, మళ్లీ బుల్ మార్కెట్లో ఆ షేర్లను విక్రయించి లాభాలు పండించుకోవటం ఎల్‌ఐసీకి అలవాటే. అందుకే ఎల్‌ఐసీ(LIC) కొత్తగా ఏయే కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది, ఏయే కంపెనీల షేర్లు విక్రయిస్తుంది.. అనే అంశాన్ని స్టాక్ మార్కెట్లోని సాధారణ మదుపరుల నుంచి సంస్థలు, నిపుణులు, హెచ్‌ఎన్‌ఐల వరకు అందరూ గమనిస్తూ ఉంటారు.
ఈ కోణంలో చూస్తే ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ) ఏం చేసిందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం... ఎల్‌ఐసీ ఈ మూడు నెలల కాలంలో తన పోర్ట్‌ఫోలియోలోని పలు కంపెనీల షేర్లను విక్రయించింది. స్టాక్ మార్కెట్(Stock market) సూచీలు రికార్డు స్థాయిలకు పెరగటం, బాగా లాభాలు కనిపిస్తూ ఉండటంతో విక్రయాలకు ఎల్‌ఐసీ సిద్ధపడిందని స్పష్టమవుతోంది.
ఎల్‌ఐసీ తన వాటా పూర్తిగా లేక పాక్షికంగా విక్రయించిన కంపెనీల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోరెపెన్ ల్యాబ్స్, హిందుస్థాన్ మోటార్స్, ఇన్‌సెక్టిసైడ్స్ ఇండియా, దాల్మియా షుగర్ ఉన్నాయి. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఏషియన్ పెయింట్స్‌లో వాటా గణనీయంగా తగ్గించుకుంది.
అదే సమయంలో కొన్ని కంపెనీల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టింది!.
వాటా కొనుగోలు..
ఆ కంపెనీల్లో.. బజాజ్ ఆటో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, టాటా(TATA) కమ్యూనికేషన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జమ్ము-కశ్మీర్ బ్యాంక్, అదానీ(ADANI) గ్యాస్, అలెంబిక్ ఫార్మా, పీఐ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బయోకాన్ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నాట్కో ఫార్మాలో 1.64 శాతం వాటా ఎల్‌ఐసీ(LIC) కొనుగోలు చేసింది. ఈ వాటాను నాలుగో త్రైమాసికంలోనూ కొనసాగించింది.
నాలుగో త్రైమాసికంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులను దేశీయ పెట్టుబడి సంస్థలు (మ్యూచువల్ ఫండ్లు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్లు) తగ్గించుకున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. దాదాపు రూ.23 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఈ సంస్థలు విక్రయించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: వేగంగా క్లెయిం పరిష్కారానికి ఎల్‌ఐసీ వెసులుబాట్లు