ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ భారత్‌లో తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు షాకిచ్చింది. ఖర్చు తగ్గింపులో భాగంగా మొత్తం ఎగ్జిక్యూటివ్‌లలో మూడో వంతు అంటే దాదాపు 56 మందిని విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సోర్సింగ్, అగ్రీ బిజినెస్, కన్స్యూమర్ గూడ్స్, రియల్ ఎస్టేట్ టీమ్ విభాగాల్లోని వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. అయితే భారత మార్కెట్ల నుంచి వాల్‌మార్ట్ వైదొలిగేది లేదని సంస్థ స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ రిటైల్ సంస్థగా పేరుగాంచిన వాల్‌మార్ట్ భారత్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కించుకోలేక గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే భారత్‌లో స్టోర్ల విస్తరణ కూడా నిలిపివేయాలని ప్రణాళికలో ఉంది. తాజాగా ఖర్చు తగ్గింపులో భాగంగా సిబ్బందిలో కోత విధించింది. భవిష్యత్‌లోనూ మరింత మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, వాల్‌మార్ట్ ఇండియాను అమ్మేయడమో.. లేదా ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేసే యోచనలో ఉన్నట్లు పలు పత్రికలు కథనాలు రచించాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి భారత్ వ్యాప్తంగా 28 హోల్‌సేల్ స్టోర్‌లు ఉన్నాయి. 2018లో వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: 5 ఏళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం