వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై ఆధారపడిన వారికి ఇటీవల కాలంలో ఆదాయం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు ఇది ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో కొన్ని బ్యాంకులు వీరి కోసం ప్రత్యేకంగా పథకాలను ప్రారంభించాయి. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెద్దలకు 0.50శాతం వరకు రాబడి అధికంగానే ఉంటుంది. కానీ, ఈ ప్రత్యేక పథకాల్లో ఇంతకు మించి అదనంగా 25 నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ అందుతోంది.
ఎస్‌బీఐ
సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన పథకం వికేర్ డిపాజిట్. ఇందులో డిపాజిట్ చేసినప్పుడు సాధారణ డిపాజిట్ కన్నా.. 80 బేసిస్ పాయింట్ల మేరకు అదనంగా వడ్డీ అందుతుంది. ప్రస్తుతం ఈ డిపాజిట్ కింద జమ చేసిన వారికి 6.20శాతం వడ్డీ లభిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
5-10 ఏళ్ల వ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేక వడ్డీ పథకం కింద 100 బేసిస్ పాయింట్ల వరకూ అదనంగా వడ్డీనిస్తున్నారు. ఈ పథకం కింద జమ చేసిన పెద్దలకు 6.25శాతం వడ్డీ అందుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
సాధారణ డిపాజిట్లతో పోలిస్తే.. 75 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీతో పెద్దల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకం సీనియర్ సిటిజెన్ కేర్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం ఈ పథకం కింద 6.25శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్
గోల్డెన్ ఇయర్స్ పేరుతో సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీతో పోలిస్తే సీనియర్లకు 80 బేసిస్ పాయింట్ల వరకూ అదనంగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ బ్యాంకు గోల్డెన్ ఇయర్స్ పథకంలో 6.30శాతం వడ్డీనిస్తోంది.
ఇదీ చూడండి: డిజిటల్ వాలెట్లలో పరస్పర నగదు బదిలీ సదుపాయం!