దేశంలో గతేడాది నవంబర్ 9 నుంచి 2021 జనవరి 31 మధ్య రూ.20,124 కోట్ల మేర జీఎస్టీ అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
నకిలీ, బోగస్ పత్రాల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై చర్యల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు నిర్మల. ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై 2,692 కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. 282 మందిని అరెస్టు చేసి రూ.856 కోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అరెస్ట్ అయిన వారిలో 12 మంది చార్టెట్ అకౌంటెంట్లు సహా 357 మంది అధికారులు ఉన్నారని విదేశీమారక నిధుల పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నియంత్రణ సంస్థ తెలిపింది. కాగా, ఆదాయపన్ను అక్రమాలపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రత్యేకంగా సమాధానమిచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ఆదాయపన్ను శాఖ రూ.2,224 కోట్ల.. 'వివరాలు వెల్లడించని అక్రమ సొమ్ము'ను గుర్తించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: జీఎస్టీ ఎగవేత.. మూడేళ్లలో ఖజానాకు రూ.3 వేలకోట్లకు గండి