Union budget 2022: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కొవిడ్ మూడో దశ కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే.. ఈ బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని, ఉపశమన చర్యలు ఉంటాయని ఆయా రంగాలు మొదలుకొని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కరోనా కారణంగా మారిన పరిస్థితులు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు, ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీనికితోడు ప్రామాణిక మినహాయింపుల (స్టాండర్డ్ డిడక్షన్)ను మరో రూ.50వేల మేర పెంచితే వేతన జీవులకు కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు. 80సీ కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపులను సవరించక ఏళ్లవుతోందని ఉదహరిస్తున్నారు. ఇదివరకు ఈ సెక్షన్ కింద మినహాయింపులు పెంచినప్పుడల్లా పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 80సి కింద ఇస్తున్న మినహాయింపు కేటగిరీలు ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయాయని, అందువల్ల వాటిని పునఃసమీక్షించి పరిమితిని రూ.3లక్షలకు పెంచితే పన్ను ప్రణాళిక విషయంలో వేతనజీవులకు కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.1లక్షకు పెంచడం కేంద్రానికి పెద్ద భారమేమీ కాబోదని, కొవిడ్ కారణంగా మారిన పని వాతావరణం, పెరిగిన ద్రవ్యోల్బణంతో వేతనజీవులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలో చిన్నస్థాయి మినహాయింపులిస్తే ఇంటి నిర్వహణ ఖర్చులో కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: బడ్జెట్‌పైనే అందరి కళ్లు.. వివిధ రంగాలు ఆశిస్తున్నవేంటి?