కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్‌ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి లభిస్తుంది. వారికి జీతంలో 50 శాతం సొమ్మును భృతిగా చెల్లిస్తారు. అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద ఈ సహాయం లభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది.
ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు. స్వయంగాగానీ, ఆన్‌లైన్‌ద్వారాగానీ, పోస్టులోగానీ ఇందుకు సంబంధించిన దరఖాస్తు పంపించవచ్చు. దరఖాస్తుతో ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంది. జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగుతుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అధ్యక్షతన జరిగిన కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో వేతనంలో 25 శాతం నిరుద్యోగ భృతి కింద లభించగా, దాన్ని ప్రస్తుతం 50 శాతానికి పెంచడం గమనార్హం. నిబంధనలను కూడా సరళీకరించారు. ఇంతకుముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండగా, ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునే వీలు కలిగించారు. ఈ సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడుతుంది.
ఇదీ చూడండి:- పట్టణాల్లో పది మందిలో ఒకరు నిరుద్యోగి!