మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ చేసిన ఆరోపణలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారం లేకున్నా ట్విటర్ ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసి భారత్‌ను కించపరిచే ప్రయత్నం చేసిందని కేంద్ర ఐటీ శాఖ మండిపడింది.
తొలుత.. భాజపా నేతల ట్వీట్లకు 'మ్యానుపులేటెడ్ మీడియా' ట్యాగ్ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ట్విటర్ ఆరోపించింది. 'కొవిడ్ టూల్‌కిట్' ఫిర్యాదు పేరుతో.. సమాచారం కావాలాని దిల్లీ పోలీసులు తమకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో తమ ఉద్యోగుల పట్ల ఆందోళనగా చెందుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దీనిపై ఆగ్రహించిన కేంద్ర ఐటీ శాఖ.. భారత్‌లో సామాజిక మాధ్యమ సంస్థల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ట్విటర్ ఆరోపణలు భారత న్యాయవ్యవస్థపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నాయని తెలిపింది.
అన్నీ అబద్ధాలే...
'కొవిడ్ టూల్‌కిట్' వ్యవహారంలో ట్విటర్ పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేసిందని దిల్లీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చట్టబద్ధమైన దర్యాప్తును తప్పుపడుతున్నట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దర్యాప్తు చేసే అధికారం, తీర్పు చెప్పే అధికారం రెండూ తమకే ఉన్నట్లు ట్విటర్ ప్రవర్తిస్తోందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు.
ఇదీ చదవండి:RBI Report: కరోనా భయాలు- ఇంట్లోనే డబ్బులు!