కరోనా వైరస్ వల్ల డిమాండు లేక ముడిచమురు ధరలు ఇటీవల రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాన చమురు ఉత్పత్తిదారులైన ఒపెక్ సభ్యదేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మే, జూన్ నెలల్లో రోజుకు 10 మిలియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. మెక్సికో మినహా మిగతా సభ్య దేశాల్ని ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత జులై నుంచి డిసెంబర్ వరకు రోజుకు 80 లక్షల బ్యారెల్ల ఉత్పత్తిని తగ్గించాలని సభ్యదేశాలు ప్రతిపాదించాయి. అయితే మెక్సికో నిర్ణయంపైనే ఇది ఆధారపడినట్లు ఒపెక్ వర్గాలు స్పష్టం చేశాయి.
రష్యా సహా ఒపెక్ సభ్యదేశాలు, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యా మధ్య ఇటీవల నెలకొన్న ధరల యుద్ధానికి ఈ నిర్ణయంతో చెక్పడుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి.
మెక్సికో ప్రతిపాదన ఇలా..
ఈ ఒప్పందం ప్రకారం మెక్సికో వాటా కింద రోజుకు 4 లక్షల బ్యారెల్ల చమురు ఉత్పత్తిని తగ్గించాలని సభ్యదేశాలు ప్రతిపాదించాయి. మెక్సికో అందుకు నిరాకరించింది. రోజుకు లక్ష బ్యారెల్ల ఉత్పత్తి తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం