కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి. జనవరి 1 నుంచి నిత్య జీవితానికి సంబంధించి పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులో వాహనాలకు సంబంధించినవి కొన్ని కాగా.. బ్యాంకింగ్, టెలికాం రంగాలకు చెందినవి మరికొన్ని ఉన్నాయి. ఆ మార్పులేంటో చూసేయండి..
ఫాస్టాగ్‌తో ఫాస్ట్‌గా: జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మినహా) కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని, నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. 2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త థర్డ్ పార్టీ వాహన బీమా పొందటానికీ ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్‌కు సంబంధించిన సహాయం కోసం 1033 నంబర్‌ను సంప్రదించొచ్చు.

ఇకపై ₹5000: ఇప్పటి వరకు కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా కేవలం ₹2వేలు మాత్రమే పిన్ ఎంటర్ చేయకుండే పేమెంట్ చేసే వీలుంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి మీ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉపయోగించి ₹5 వేల వరకు లావాదేవీలు జరపొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఎన్‌ఎఫ్‌సీ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. నగదు పరిమితిని తగ్గించడం గానీ, పూర్తిగా జరగకుండా నిలిపివేయడం ఖాతాదారుని ఇష్టం.

మోసాలకు 'చెక్': చెక్ సంబంధిత మోసాలను నిలువరించే లక్ష్యంతో 'పాజిటివ్' పే విధానాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. ఈ విధానం జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు చెక్, దానిపై ఖాతాదారుని సంతకం ఉంటే చెక్ మంజూరు చేస్తున్నాయి. అయితే.. తాజా విధానం వల్ల రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసిన చెక్కులను పునః సమీక్షించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని బ్యాంకులు అమలు చేయొచ్చు, వినియోగదారుని ఇష్టం మేరకు వదిలేయొచ్చు. అయితే.. రూ.5లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన చెక్కులకు మాత్రం పునః సమీక్ష తప్పనిసరి. దీని ప్రకారం చెక్కు జారీ చేసే వ్యక్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో(ఎస్ఎమ్ఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం) చెక్కు వివరాలను బ్యాంకుకు తెలియపరచాల్సి ఉంటుంది. ఆ వివరాలను బ్యాంకు పరిశీలిస్తుంది. దీనివల్ల మోసపూరిత లావాదేవీలకు ఆస్కారం ఉండదని తెలిపింది ఆర్‌బీఐ.

ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్: కొత్త ఏడాది మొదటి రోజు నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐఫోన్లలో ఐవోఎస్-9, ఆండ్రాయిడ్ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ముందువి(పాతవి) ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్.. తన సేవలను నిలిపివేయనుంది. ఐవోఎస్-9 అంటే.. ఐఫోన్-4 దానికన్నా ముందు వచ్చిన మోడళ్ల ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఒకవేళ మీరు వాడేది మరీ పాత ఫోన్ అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఓ సారి వెర్షన్‌ను తనిఖీ చేసుకోండి.

వాహనం.. భారం: కొత్త ఏడాదిలో కొత్త బైక్ లేదా కారు కొనుక్కోవాలనుకునేవారికి వాహన కంపెనీలు షాక్ ఇచ్చాయి. ముడిసరకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే జనవరి 1 నుంచి వాహనాల ధరలు పెంచుతున్నామని పలు వాహన తయారీ కంపెనీలు ప్రకటించాయి. ప్రముఖ కార్ల కంపెనీలైన మారుతీ సుజుకీ, ఎంజీ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనోతో పాటు హీరో మోటోకార్ప్ సైతం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషీన్ల ధరలూ పెరగనున్నాయి.

చిన్న వ్యాపారులకు ఊరట: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ 42వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు జనవరి 1 నుంచి త్రైమాసికానికోసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది. ఇకపై నెలకోసారి రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల సుమారు 94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

'సున్నా' తప్పనిసరి: ఇకపై ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు చేయబోయే కాల్స్‌కు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ '0'ను తప్పనిసరి చేసింది. జనవరి 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీనివల్ల 2,539 సంఖ్య శ్రేణులు అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా తగినన్ని సంఖ్యా వనరుల సృష్టికి ట్రాయ్ సిఫార్సుల మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. మొబైల్ నుంచి మొబైల్‌కు, ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్ లైన్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పులూ ఉండబోవు.

ఇదీ చదవండి: ప్రైవేటీకరణకు ఎయిరిండియా- అదే బాటలో మరో ఆరు