Tega Industries IPO: ఖనిజ శుద్ధి ప్రక్రియ, గనుల తవ్వకం, బల్క్ సాలిడ్స్ హ్యాండ్లింగ్ పరిశ్రమకు అవసరమైన కీలక ఉత్పత్తుల తయారీ, పంపిణీని నిర్వహిస్తోన్న టెగా ఇండస్ట్రీస్ షేర్లు నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 67.77 శాతం ప్రీమియంతో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాయి. ఇష్యూ ధర రూ.453 కాగా రూ.760 వద్ద బీఎస్‌ఈలో.. 69.33 శాతం ప్రీమియంతో రూ.767.10 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. ఐపీఓలో ఒక్కో లాట్‌కు 33 షేర్లు నిర్ణయించారు. అంటే ఒక్కో లాట్‌పై రూ.14,619 పెట్టుబడిగా పెట్టారు. దీంతో 67.77 శాతం ప్రీమియం లెక్కన ఒక్కో లాట్‌పై మదుపర్లు రూ.10,131 లిస్టింగ్ గెయిన్స్ సంపాదించారు. మధ్యాహ్నం 11:44 గంటల సమయంలో నిఫ్టీలో ఈ షేరు 61 శాతం లాభంతో రూ.732 వద్ద ట్రేడవుతోంది.
ఈ కంపెనీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) డిసెంబరు 1న ప్రారంభమై 03న ముగిసింది. ఈ ఇష్యూ ద్వారా రూ.619 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూలో మొత్తం 1,36,69,478 ఈక్విటీ షేర్లు అందుబాటులో ఉంచారు. ఇవన్నీ ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించినవే.
టెగా ఇండస్ట్రీస్‌ను 1976లో స్థాపించారు. ఆదాయపరంగా పాలిమర్ ఆధారిత మిల్ లైనర్లను తయారు చేయడంలో ఈ సంస్థది ప్రపంచంలోనే రెండో స్థానం. ఖనిజ శుద్ధి పరిశ్రమలో మైనింగ్, ప్రాసెసింగ్, స్క్రీనింగ్, గ్రైండింగ్, హ్యాండ్లింగ్ వంటి వివిధ దశల్లో రాపిడి, అరుగుదల నిరోధకతకు ఉపయోగించే రబ్బర్, పాలీయురేతీన్, ఉక్కు, సెరామిక్ ఆధారిత లైనింగ్‌లను ఇది అందిస్తోంది. మొత్తం 55 ఉత్పత్తులను తయారు చేస్తోంది. భారత్(3)తో పాటు చిలీ(1), దక్షిణాఫ్రికా(1), ఆస్ట్రేలియా(1)లో తయారీ కేంద్రాలున్నాయి. సంస్థకు వస్తున్న ఆదాయంలో దాదాపు 87 శాతం భారత్ వెలుపలి నుంచే వస్తుండడం గమనార్హం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇవీ చూడండి:
Gold mortgage: పసిడి రుణ వితరణలో బ్యాంకులు- ఎన్‌బీఎఫ్‌సీల పోటీ!