ఈ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా స్థిరంగా పెరుగుతుండటం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.
- ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 40 నుంచి 43 డాలర్ల మధ్యే ఉన్నప్పుడు ధరలు పెంచడం.
- రెండోది.. ఇప్పటికే కరోనా సంక్షోభం కారణంగా వ్యాపారాలు, ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో చమురు ధరలకు రెక్కలు రావడం.
దేశరాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలను గమనిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులు, సుంకాలు చమురు ధరల్లో మూడింట రెండొంతులు ఉంది. అందులో సింహభాగం కేంద్రానికే పన్ను రూపంలో వెళ్తోంది. దిల్లీలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో 42 శాతం కేంద్రానికి పన్ను రూపంలో వెళ్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి 23 శాతం వ్యాట్ రూపంలో సమకూరుతోంది.
చమురు సంస్థలే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని 'ఈటీవీ భారత్'తో ఓ సీనియర్ అధికారి చెప్పారు.
తొలిసారి..
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు 80 రోజుల విరామం అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను ఈ నెల మొదటి నుంచి పెంచడం ప్రారంభించాయి. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ 8.7 పెరిగింది. డీజిల్ ధర పెట్రోల్‌ను అధిగమించి లీటరుకు రూ.10.63 మేర ఎగబాకింది. దేశరాజధానిలో డీజిల్ ధర పెట్రోల్ కంటే ఎక్కువ ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి.
ఇటీవలి కాలంలో చవిచూసిన నష్టాలను పూడ్చుకునేందుకే చమురు సంస్థలు ధరలు పెంచుతున్నాయని అధికారి తెలిపారు. క్రూడ్ ఆయిల్ ధరలు అధికంగా ఉన్నప్పుడు వారు కొనుగోళ్లు జరిపారని ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయని వివరించారు.
ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో దిల్లీలో డీజిల్ బేస్ ప్రైస్‌ను పరిశీలిస్తే జూన్ 16న లీటరుకు 22.93 శాతంగా ఉంది.
- రవాణా సుంకం లీటరుకు 30 పైసలు వసూలు చేస్తున్నారు.
- ఎక్సైజ్ సుంకం, వ్యాట్ మినహాయిస్తే లీటరు డీజిల్ ధర రూ.23.23.
- కేంద్ర ప్రభుత్వం లీటరు డీజిల్‌పై రూ.31.83 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది.
- డీలర్ కమిషన్ రూ.2.53 గా ఉంది.
- దిల్లీ ప్రభుత్వం విధించే వ్యాట్ రూ.17.60తో కలిపి లీటరు ధర దాదాపు రూ.80కి చేరింది.
దిల్లీలో లీటరు డీజిల్ ధరలో పన్నులు, డీలర్ మార్జినే 69 శాతంగా ఉంది. అందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలే 66 శాతం. ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రానికి 42 శాతం వాటా వెళ్తోంది. వ్యాట్ రూపంలో దిల్లీ ప్రభుత్వానికి 23.4 శాతం సమకూరుతోంది. చివరకు వినియోగదారుడు లీటరు డీజిల్‌కు చెల్లించే ధరలో మూడింట రెండొంతుల భాగం పన్నులు, సంకాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయమవుతోంది. అందులో కేంద్రమే అధిక ప్రయోజనం పొందుతోంది.
- కృష్ణానంద్ త్రిపాఠి, ఈటీవీ భారత్