కరోనా వైరస్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఇప్పటికే మహారాష్ట్రలోని ప్లాంట్‌లో వాహనాల తయారీ కార్యకలాపాలు తగ్గించినట్లు పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఎండీ గ్వెంటర్ బషెక్ శుక్రవారం ఓ ప్రకటన చేశారు.
'దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల పరిధిలో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తీవ్రతరమైతే మంగళవారం నుంచి ప్లాంట్ కార్యకలాపాలు ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం’
గ్వెంటర్ బషెక్, టాటా మోటార్స్ ఎండీ
టాటా.. దేశంలోనే అతి పెద్ద వాహన తయారీ సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా తయారీ కేంద్రాలు ఉన్నాయి. పుణెలో ఉన్న తయారీ కేంద్రం ఈ సంస్థకు ఎంతో కీలకం. ఎక్కువగా కార్లు, ట్రక్కులకు సంబంధించిన తయారీ కార్యకలాపాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ దృష్ట్యా ప్లాంట్ మూసివేత లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ.. వారికి మార్చి, ఏప్రిల్ నెల జీతాలు చెల్లిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.
అదే విధంగా టాటాకు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా యూకేలో తమ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు గురువారం ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఏప్రిల్ 20 వరకు కార్ల ఉత్పత్తిని ఆపేయనున్నట్లు తెలిపింది.