నష్టాల నుంచి తేరుకుని.. వారాంతపు సెషన్లో లాభాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. బీఎస్ఈ-సెన్సెక్స్ 214 పాయింట్లు బలపడి 37,435 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 11,372 వద్దకు చేరింది. మిడ్ సెషన్ ముందు భారీ లాభాలవైపు దూసుకెళ్లిన సూచీలు.. ఐటీ, హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా కాస్త జోరు తగ్గాయి.
అంతర్జాతీయ సానుకూలతలు, విద్యుత్ షేర్ల దన్ను శుక్రవారం లాభాలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంకింగ్ షేర్లు కూడా సానుకూలంగా స్పందించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,580 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,423 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,418 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,366 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా లాభపడ్డాయి.
భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ఆసియాలో ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోలో, హాంకాంగ్ సూచీలూ శుక్రవారం లాభాలను నమోదు చేశాయి.
రూపాయి
కరెన్సీ మార్కెట్లో రూపాయి శుక్రవారం 18 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 74.84 వద్దకు చేరింది.