ETV Bharat / business

సెంటిమెంటు బలహీనమే- ఈ వారమూ ఒడుదొడుకులు! - స్టాక్​ మార్కెట్​ అవుట్​లుక్​

స్టాక్​ మార్కెట్లో ఈ వారం సూచీల ఒడుదొడుకులు కొనసాగుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశంలో కరోనా కేసులు పెరగడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. అయితే.. ఐటీ షేర్లు మాత్రం సానుకూలంగా సాగే అవకాశముందన్నారు.

STOCK MARKET OUTLOOKS OF EXPERTS
సెంటిమెంటు బలహీనమే
author img

By

Published : Mar 22, 2021, 5:21 AM IST

దేశీయ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరుగుతుండడానికి తోడు, అంతర్జాతీయంగా-దేశీయంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. నిఫ్టీ-50.. 14,800 పాయింట్ల పైకి వెళితేనే షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీకి అవకాశం ఉంటుందని.. అపుడు 15,000-15,300 వరకు లాభాలు రావొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీసీ షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చని భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే...

  • ప్రాథమిక లోహ అంతర్జాతీయ ధరల నుంచి మన గనుల, తవ్వక కంపెనీల షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. గత వారం 2-5% మేర పెరిగిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌ షేర్లు ఈ వారమూ రాణించొచ్చు.
  • కీలక సూచీలతో పోలిస్తే ఐటీ కంపెనీల షేర్లు మెరుగ్గా ఉండొచ్చు. రక్షణాత్మకం కావడం, ఈ రంగంపై బలమైన భవిష్యత్‌ అంచనాలుండడం ఇందుకు కారణం. ఈ వారంలోనే త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న అసెంచర్‌పై మదుపర్లు దృష్టి సారించొచ్చు.
  • తుక్కు విధానం వల్ల వాహన విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపొచ్చు. ప్రయాణికుల వాహన ధరలు 8-10% మేర తగ్గొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • బ్యాంకు షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ గడువుకు ముందు బ్యాంకు షేర్లలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. రోలోవర్ల కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో ట్రేడింగ్‌ సానుకూలంగా ఉండొచ్చు.
  • ప్రభుత్వ రంగ చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. అంతర్లీనంగా సానుకూల ధోరణి కనిపిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండటం వల్ల.. రిఫైనింగ్‌, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు రాణించవచ్చు. ముడి చమురు ధరలను బట్టి అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు చలించొచ్చు.
  • సిమెంటు కంపెనీల షేర్లు నష్టపోవచ్చు. ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయన్న అంచనాలే ఇందుకు కారణం.
  • టెలికాం కంపెనీలకు సంబంధించి వరుసగా ఆరో నెలా చందాదార్లను జతచేసుకున్న భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కదలాడొచ్చు. వొడాఫోన్‌ ఐడియా కూడా 15 నెలల తర్వాత వినియోగదార్లను పెంచుకున్నా.. భవిష్యత్తుపై అనిశ్చితి ఉంది.
  • ఔషధ కంపెనీల షేర్లు ఒత్తిడిలో కొనసాగొచ్చు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే, ఆసుపత్రులకు రోగులు రావడం తగ్గి, ఔషధ అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళనే ఇందుకు కారణం. కొంత మంది రక్షణాత్మక మదుపర్లు మాత్రం తమ పెట్టుబడులు పెంచుకోవచ్చు.

ఇదీ చదవండి: జియోకు షాక్​- ఎయిర్​టెల్​ ఫుల్​ ఖుష్​!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.