స్టాక్ మార్కెట్లు రోజు రోజు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 316 పాయింట్లు బలపడి.. 43,594 వద్ద (జీవనకాల గరిష్ఠం) స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 118 పాయింట్ల వృద్ధితో 12,749(జీవనకాల రికార్డు స్థాయి) వద్దకు చేరింది.
కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయంగా కొవిడ్ రెండో దశ విజృంభణ మినహా ఇతర పరిణామాలు సానుకూలంగా ఉండటం వల్ల మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్తున్నట్లు విశ్లేకులు చెబుతున్నారు.
దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. లోహ, ఆర్థిక, ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 43,708 (జీవనకాల గరిష్ఠం)పాయింట్ల అత్యధిక స్థాయి, 42,970 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,770 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 12,571 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. టోక్యో, సియోల్ సూచీలు భారీగా లాభాలను గడించాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
ఇదీ చూడండి:బైడెన్ రాకతో భారత్‌లో తగ్గనున్న పెట్రో ధరలు!