సొంత ఇంటి కలపై ఉక్కు పిడుగు పడింది. స్టీలు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ టన్ను రూ.55 వేలుగా ఉండగా..ప్రస్తుతం రూ.65 వేలకు చేరింది. ప్రముఖ బ్రాండ్లవి రూ.75 వేల వరకు పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా, దేశంలోనూ నెలకొన్న బొగ్గు కొరత, చైనాలో నెలకొన్న పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణమనే విశ్లేషణలున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో.. సొంత ఇంటి నిర్మాణం మరింత భారమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కరోనా సమయంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో స్టీలుకు గిరాకీ తగ్గింది. కరోనా రెండు దశ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనటంతో నిర్మాణ రంగం ఇటీవల కాలంలో పుంజుకుంది. స్టీలు కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో బొగ్గు కొరత సమస్యగా మారింది. కరోనాతో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. ఇటీవల వరకు వెలికితీసిన బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. అంతర్జాతీయంగానూ బొగ్గు దిగుమతులు మందగమనంలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బొగ్గు తవ్వకాలను పెంచడంతోపాటు దిగుమతులను విస్తృతం చేసినా పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందనే అనుమానాలున్నాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ‘బొగ్గు కొరతతో దేశీయంగా విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో బొగ్గు దిగుమతులు పెరిగినా తొలి ప్రాధాన్యం విద్యుత్తు రంగానికి ఇచ్చే అవకాశాలుంటాయి. ఫలితంగా నిర్మాణ రంగానికి అవసరమైన స్టీలు ఉత్పత్తి తగ్గుతుంది. చైనాలోనూ బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటంతో అక్కడా కొరత ఏర్పడింది. ఈ కారణంగా ఆ దేశం విద్యుత్తు కోతలను అమలుచేస్తోంది. అది కూడా స్టీలు తయారీపై ప్రభావం చూపింది. ఇవన్నీ ధర పెరుగుదలకు కారణమయ్యాయని’ పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.
నిర్మాణ వ్యయంపై ప్రభావం
స్టీలు కొరత, ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని, ఈ కారణంగా నిర్మాణాలు జాప్యమయ్యే అవకాశం ఉందని ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘సాధారణంగా వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో 5 అంతస్తుల్లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్టుమెంటు నిర్మించాలంటే సుమారు 90 నుంచి 110 టన్నుల ఉక్కు అవసరం అవుతుందన్నది అంచనా. ఇటీవల వరకు స్టీలు ధర టన్ను ధర రూ.50-55 వేల వరకు ఉంది. ప్రస్తుతం రూ.65 వేల వరకు పలుకుతోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణ ధర రూ.100 వరకు పెరుగుతుందని’ నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు.
బొగ్గు కొరతతో ధరల పెరుగుదల
బొగ్గు కొరత వల్లనే గడిచిన 10-15 రోజుల వ్యవధిలోనే స్టీలు ధరలు భారీగా పెరిగాయి. ఆ ప్రభావం అపార్టుమెంట్లలో ఫ్లాట్ల కొనుగోలు చేసే వారితోపాటు, వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకునే వారిపైనా పడుతున్న మాట వాస్తవం. మొత్తంగా ఈ పరిణామాలు నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
- సీహెచ్ రామచంద్రారెడ్డి అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ
ఇదీ చూడండి: పెరిగిన ధరలు-నిర్మాణ రంగం కుదేలు