ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్(Ola Electric Scooter) కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అమితాసక్తిని కనబరిచారు. అమ్మకాలు ప్రారంభించిన మొదటిరోజే తమకు ఊహించని రీతిలో స్పందన లభించినట్లు ఓలా సంస్థ తెలిపింది. రూ.600 కోట్లకు పైగా విలువ చేసే.. ఎస్1 మోడల్ స్కూటర్ల(Ola Electric Scooter) అమ్మకాలు జరిగినట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్.. ట్విట్టర్ వేదికగా తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మాకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
"భారతీయులు పెట్రోల్ వాహనాలను కాదని విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మేము సెకనుకు 4 స్కూటర్ల చొప్పున అమ్మాం. వీటి విలువ రూ.600 కోట్లకుపైనే. ఈరోజే ఓలా స్కూటర్ కొనుగోలుకు చివరిరోజు. గురువారం అర్ధరాత్రి నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తున్నాం."
-భవీష్ అగర్వాల్, ఓలా సహ వ్యవస్థాపకుడు
అమ్మకాలను ప్రారంభించిన వెంటనే వినియోగదారుల నుంచి ఊహించన రీతిలో స్పందన వచ్చిందని భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. భారత్‌లో రెండు వారాల్లో జరిగే స్కూటర్ అమ్మకాల్లో తాము 24 గంటల్లో జరిపామని చెప్పారు. భారత్‌ను అతిపెద్ద విద్యుత్ వాహనాల మార్కెట్‌గా మార్చడమే కాకుండా, తయారీ కేంద్రంగా కూడా మార్చేందుకు తాము ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఓలా ఈ-స్కూటర్ బుకింగ్, టెస్ట్ రైడ్, డెలివరీ ఇలా...