కొవిడ్ మహమ్మారి సమయంలో మహిళలు, సామాజికంగా వెనుకబడిన ఇతర వర్గాలు ఎక్కువగా నష్టపోతున్నారని అనేక నివేదికలు వెల్లడించాయి. సంఘటిత ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయకపోవడం, లింగ వైవిధ్యం లేకపోవడం వల్ల.. ప్రస్తుత డాలర్ రేటు వద్ద ఈ అంతరం పూరించడానికి 257ఏళ్లు పట్టవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్‌లోని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. లింగ సమానత సాధించనందున ప్రపంచానికి 1990 నుంచి ఇప్పటివరకు 70లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లవుతుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా పూర్తిస్థాయిలో లింగ సమానత సాధించగలిగితే ఇది ప్రపంచ జీడీపీని 2025 కల్లా 28 లక్షల కోట్ల డాలర్లకు పెంచుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. లింగ అసమానత వల్ల మానవ మూలధన సంపద 160.2 లక్షల కోట్ల డాలర్ల మేర కోల్పోతుందని అంచనా వేశారు. మహమ్మారి సమయంలో మహిళలు లక్ష కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారని వివరించారు. విద్య, ఉపాధిలో లింగ, జాతి అంతరాలను పట్టించుకోనందున 2019లో 2.6 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ఉత్పత్తి పెరగడం గమనార్హం.
మహిళా ఉత్పత్తులకు ప్రత్యేక స్టోర్: అమెజాన్
అమెజాన్ ఇండియా తన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక స్టోర్‌ను ఆవిష్కరిస్తోంది. 450 మందికి పైగా మహిళలు నిర్వహించే చిన్న పాటి వ్యాపారాలకు సంబంధించిన 80వేలకుపైగా ఉత్పత్తులను ఈ స్టోర్‌లో ఉంచనుంది. ఇందులో జరిగే ప్రతి లావాదేవీలో కొంత వాటా తమ స్వచ్ఛంద సేవా భాగస్వామి సంస్థ 'నాన్హీ కాలి'కి వెళుతుంది. వాటిని బాలికా విద్యకు ఉపయోగిస్తారు. మహిళలు నిర్వహించే వ్యాపారాలకు మద్దతిచ్చేందుకు యూఎన్ ఉమెన్‌తో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 'మహిళల చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు విజయవంతం కావడానికి అమెజాన్ కట్టుబడి ఉంద'ని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో ఇంకెంతకాలం ఈ పెట్రో బాదుడు?